రూ. 15 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టిన ఏఈ
కాల్‌మనీతో లింకున్నట్లు ఏసీబీ పాథమిక విచారణలో వెల్లడి
విజయవాడ సిటీ: భారీ స్థాయిలో అక్రమాస్తులు కూడబెట్టిన ఎలక్ట్రికల్ ఏఈని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. విజయవాడ మధురానగర్ విద్యుత్ సబ్ స్టేషన్‌లో సహాయక ఇంజినీరుగా పనిచేస్తున్న బొడ్డపాటి వెంకటరావు (46) అక్రమాస్తులపై ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. మాచవరం డౌన్ బుల్లమ్మ వీధిలోని వెంకటరావు ఫ్లాటుతోపాటు సమీపంలో ఉండే అతని మామ, గుడివాడ సమీపంలోని దోసపాడులో ఉంటున్న తండ్రి, సోదరుని ఇళ్లల్లో కూడా ఏకకాలంలో సోదాలు చేశారు. ఈ సోదాల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.1.50 కోట్ల స్థిర, చర ఆస్తులున్నట్టు అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ సుమారు రూ.15కోట్లు ఉంటుందని అంచనా. 1992లో అసిస్టెంట్ లైన్‌మెన్‌గా విద్యుత్‌శాఖలో చేరిన వెంకటరావు అంచలంచెలుగా అసిస్టెంట్ ఇంజినీరు వరకు ఎదిగారు. భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే సమాచారంతో కేసు నమోదు చేసి కోర్టు అనుమతితో దాడులు చేసినట్లు విజయవాడ రేంజ్ ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ తెలిపారు. వెంకటరావు తను నివసిస్తున్న అపార్టుమెంట్‌లోనే మరో ఫ్లాట్‌ను అద్దెకు ఇచ్చాడు.
వీటితో పాటు పటమట రామాలయం వీధిలోని శ్రీరాం టవర్స్‌లో రెండు ఫ్లాట్లు, గొల్లపూడిలో జాతీయ రహదారికి సమీపంలో ఖరీదైన త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాటు ఉన్నట్టు గుర్తించారు. దోసపాడు గ్రామంలో తనతో పాటు భార్య పేరిట చెరో రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వేర్వేరు వ్యక్తులకు అప్పులు ఇచ్చినట్టుగా 25 ప్రామిసరీ నోట్లు ఇంట్లో లభ్యం కాగా, బ్యాంకు లాకరులో పలు పాసు పుస్తకాలు, చెక్కులు దొరికాయి. సమీపంలోని ఇతని మామ ఇంట్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.48 లక్షల విలువైన ఐదు టైటిల్ డీడ్స్, 10 చెక్కులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవికాక బ్యాంకులో తనఖా పెట్టిన అరకిలో బంగారంతో పాటు పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారుల ప్రాథమిక విచారణలో వెంకటరావు కాల్‌మనీ వ్యాపారం కూడా చేస్తున్నట్టు గుర్తించారు. బాధితులు ముందుకు వస్తే తగిన విధంగా న్యాయం చేయనున్నట్టు డీఎస్పీ గోపాలకృష్ణ చెప్పారు.
ఏసీబీకి చిక్కిన ఎలక్ట్రికల్ తిమింగలం
Published Thu, Feb 25 2016 12:28 AM | Last Updated on Tue, Jun 4 2019 6:45 PM
Advertisement
Advertisement