సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగులు, అధికారులు ఈ నెల 25న వారికి సంబంధించిన ఫైళ్లు, కంప్యూటర్లు, సెలఫోన్లు తీసుకుని వారికి కేటాయించిన బ్లాకుల్లో వారి స్థానాలకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. తెలంగాణ, సీమాంధ్ర ప్రభుత్వాల పాలనకు కేంద్ర బిందువైన సచివాలయంలోని బ్లాకుల్లో ఏ శాఖ, ఏ విభాగం, ఏ అంతస్తులో ఉం డాలో సూచిస్తూ త్వరలో ఆదేశాలు జారీ కానున్నాయి. శాఖాధిపతులు, కమిషనరేట్లు, డెరైక్టరేట్లలో కూడా తెలంగాణ, సీమాంధ్ర ప్రభుత్వాలకు కేటాయించిన అంతస్తులను తెలియజేస్తూ ఆదేశాలు జారీ కానున్నాయి. ఉదాహరణకు ప్రస్తుతం సాధారణ పరిపానల శాఖ సచివాలయంలోని బి, సి బ్లాకుల్లో ఉంది. ఇప్పుడు తెలంగాణ సాధారణ పరిపాలన శాఖకు సి బ్లాకును కేటాయించారు.
విభజన అనంతరం ఈ విభాగంలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు వారికి కేటాయించిన బ్లాకులోకి వెళ్లాల్సి ఉంటుంది. వారు వినియోగిస్తున్న కంప్యూటర్లు, సెల్ ఫోన్లను కూడా తీసుకెళ్లాలి. కుర్చీలు, టేబుళ్లు, అల్మారాలు, ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు మాత్రం ఎక్కడివి అక్కడే ఉంటాయి. అలాగే సీమాంధ్ర ఉద్యోగులు సీమాంధ్ర ఫైళ్లను, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ ఫైళ్లను పట్టుకెళ్లాలి.