ఎక్కడివాళ్లు అక్కడికే.. | government seeks ec for employees distribution | Sakshi
Sakshi News home page

ఎక్కడివాళ్లు అక్కడికే..

Published Sun, May 11 2014 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 7:11 AM

ఎక్కడివాళ్లు అక్కడికే..

ఎక్కడివాళ్లు అక్కడికే..

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనలో కీలకమైన రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులు, ఉద్యోగుల పంపిణీని తొలుత తాత్కాలికంగా చేయాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర సలహా కమిటీ చైర్మన్ కమలనాథన్ నిర్ణయించారు. ఈ నెల 25న తెలంగాణ, సీమాంధ్ర ప్రభుత్వాలకు పోస్టులు, ఉద్యోగులను పంపిణీ చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని  నిర్ణయం తీసుకున్నారు. జీవో 610 ప్రాతిపదికన ఉద్యోగుల స్థానికతను నిర్ధారిస్తారు. ఈ ప్రకారం ఏ ప్రాంతానికి చెందినవారిని ఆ ప్రాంతానికే కేటాయిస్తూ తాత్కాలిక ఆదేశాలు జారీ చేస్తారు. రెండు రాష్ట్రాలు ఏర్పాటైన రోజు నుంచే ఉద్యోగుల విషయంలో గానీ మరో అంశంలో గానీ సమస్యలు, ఇబ్బం దుల రాకుండా ముందుకు సాగాలనే ఆలోచనలో భాగంగానే తొలుత ఏ ప్రాంతం వారిని ఆ ప్రాంతానికి కేటాయిస్తూ తాత్కాలిక పంపిణీ ఆదేశాలను జారీ చేయాలని నిర్ణయించారు.

 

రాష్ట్రస్థాయి కేడర్‌లో రాజధానిలో ఉన్న ప్రభుత్వ శాఖలు, విభాగాల్లోని ఉద్యోగులనే తొలుత పంపిణీ చేయనున్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడ్డాక, వాటితో సంప్రదింపులు జరిపిన తర్వాతే జిల్లాల్లోని రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపి ణీ చేయాలని నిర్ణయానికి వచ్చారు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న మేరకు కొన్ని రంగాలకు అప్షన్లు ఇవ్వనున్నారు. ప్రధానంగా త్వరలో పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు ఆప్షన్లు ఇస్తారు. ఎన్ని సంవత్సరాల్లో పదవీ విరమణ చేసేవారికి ఆప్షన్ ఇవ్వాలనేది మార్గదర్శకాల్లో పేర్కొంటారు. గతంలో రెండు సంవత్సరాల్లో పదవీ విరమణ చేసేవారికి ఆప్షన్లు ఇవ్వాలని కేంద్రం పేర్కొంది. ఆ తర్వాత.. ఏడాదిలో పదవీ విరమణ చేసేవారికే ఆప్షన్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

 

అయితే సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు ఐదేళ్లలో పదవీ విరమణ చేసేవారికి ఆప్షన్లు ఇవ్వాలని కమలనాథన్ కమిటీని కోరాయి. తెలంగాణ ఉద్యోగ సంఘాలైతే అసలు ఆప్షన్లే ఇవ్వొద్దని కమిటీకి వినతిపత్రం సమర్పించాయి. మధ్యేమార్గంగా రెండు లేదా మూడేళ్లలో పదవీ విరమణ చేసే ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వాలనే ఆలోచనలో అటు కేంద్రంతోపాటు ఇటు కమలనాథన్ కమిటీ యోచిస్తోంది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వాలని చట్టంలో ఉన్నందున వాటిని అమలు చేయనున్నారు. అలాగే భార్యాభర్తల ఉద్యోగులకు, కొన్ని రోగాలతో బాధపడుతున్నవారికి ఆప్షన్లు ఇవ్వనున్నారు. మహిళలకు కూడా ఆప్షన్లు ఇవ్వాలనే ప్రతిపాదనలను కేంద్రం, కమలనాథన్ కమిటీ పరిశీలిస్తున్నాయి.
 
 అనుమతి కోసం ఈసీకి వినతి
 
 రాష్ట్ర కేడర్ ఉద్యోగులతోపాటు అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీ మార్గదర్శకాలను ఈ నెల 12 తర్వాత జారీ చేసేందుకు అనుమతించాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం కోరింది. 16న ఓట్ల లెక్కింపు అనంతరమే మార్గదర్శకాలు జారీచేయాలని తొలుత ఎన్నికల సంఘం పేర్కొనగా.. 12న చివరి దశ పోలింగ్ ముగుస్తున్నందున అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. దీనిపై ఈసీ ఇంకా తన నిర్ణయం వెలువరించలేదు. కమిషన్ సానుకూలంగా స్పందిస్తే ఈ నెల 13న లేదంటే 17 లేదా 18న అఖిల భారత సర్వీసు, రాష్ట్ర కేడర్ ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలను కేంద్రం జారీచేయనుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement