నడిరేయి దాటినా చెదరని సంకల్పం | Ended YS Jagan tour in kakinada | Sakshi
Sakshi News home page

నడిరేయి దాటినా చెదరని సంకల్పం

Published Sun, Jul 5 2015 2:33 AM | Last Updated on Wed, Apr 4 2018 9:25 PM

నడిరేయి దాటినా చెదరని సంకల్పం - Sakshi

నడిరేయి దాటినా చెదరని సంకల్పం

* అలుపెరుగని బాటసారి కోసం జననిరీక్షణ
* ముగిసిన వైఎస్ జగన్ పర్యటన

సాక్షిప్రతినిధి, కాకినాడ: ఆపన్నులకు ఆసరాగా నిలవాలన్న చెదరని సంకల్పం ముందు నడిరేయి చిన్నబోయింది. అలుపెరుగని బాటసారికి జనాభిమానం పోటెత్తింది. అయిన వారిని కోల్పోయి దుఖఃసాగరంలో ఉన్న బాధిత కుటుంబాల్లో కొండంత ధైర్యాన్ని నింపుతూ వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గోదావరి జిల్లాల పర్యటన సాగింది.

మూడు రోజుల పర్యటనలో భాగంగా తూర్పుగోదావరిలో 185 కిలోమీటర్లు పర్యటించిన జగన్ సముద్ర వేటకు వెళ్లి మృత్యువు కబళించిన 28 మత్స్యకార కుటుంబాలను ఓదార్చారు. రంపచోడవరం ఏజెన్సీలో పెళ్లి వ్యాన్ బోల్తాపడి మృతిచెందిన తొమ్మిది మందికి చెందిన గిరిజన కుటుంబాలను పరామర్శించారు. తునిలో గురువారం సాయంత్రం ఐదు గంటలకు మొదలైన జగన్ జిల్లా పర్యటన శనివారం రాజమండ్రితో ముగిసింది.

తొలిరోజు తుని నియోజకవర్గం పెరుమాళ్లపురం సెంటర్‌లో జరిగిన సభలో జగన్ ప్రసంగం సెజ్ బాధిత కుటుంబాలకు కొత్త ఉత్తేజాన్నిచ్చింది. తీరప్రాంత మత్స్యకారులు జగన్‌ను చూసేందుకు, మాట్లాడేందుకు ఎగబడటంతో సుమారు 75 కిలోమీటర్లు పర్యటనకు 7.30 గంటల సమయం పట్టింది. పిఠాపురం నియోజకవర్గంలో తీరప్రాంతం యు కొత్తపల్లి మండలం రామన్నపాలెం, కొత్తపట్నం గ్రామాల్లో బాధిత కుటుంబాలను పరామర్శించేసరికి రాత్రి 12.18 గంటలైంది. అయినా ఆయన అలిసిపోకుండా రెండోరోజు శుక్రవారం కాకినాడ సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో తీరప్రాంత మత్స్యకార గ్రామాల్లో బాధిత కుటుంబాలను ఓదార్చారు.

ఆరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఏజెన్సీ గంగవరం మండలం సూరంపాలెం చేరుకోవాల్సి ఉండగా వెల్లువలా పోటెత్తిన జనాభిమానంతో 12 గంటలు ఆలస్యంగా అక్కడకు చేరుకున్నారు. అర్ధరాత్రి దాటాక కొత్తాడ చేరుకుని పెళ్లి వ్యాన్ ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించారు. పోలవరం ముంపు మండలాలు, రంపచోడవరం నియోజకవర్గం ఇతర మండలాల నుంచి సూరంపాలెం వచ్చిన గిరిజనులు అర్ధరాత్రి సమయం దాటిపోయినా జగన్ రాకకోసం ఎదురుచూశారు. పిల్లలతో కలిసి అక్కడే వేచి ఉన్న వందలాది మంది గిరిజనులను చూసి జగన్ చలించిపోయారు. త్వరలోనే ముంపు మండలాల్లోను పర్యటిస్తానని వారికి హామీ ఇచ్చారు.

రెండవ రోజు పర్యటనలో భాగంగా ఉదయం నుంచి క్షణం విశ్రమించకుండా సుమారు 18 గంటలపాటు 60 కిలోమీటర్లు పర్యటించిన జగన్ 19 కుటుంబాలను పరామర్శించారు. కేవలం నాలుగు గంటలు నిద్ర తర్వాత శనివారం తెల్లవారుజామున సుమారు 50 కిలోమీటర్లు ప్రయాణించి రాజమండ్రి చేరుకున్న జగన్ దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన్‌రంగా జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

పశ్చిమగోదావరి జిల్లా దొమ్మేరులో మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి, వైఎస్ విగ్రహానికి  పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత దేవరపల్లి పొగాకు వేలం కేంద్రానికి భారీగా తరలివచ్చిన పొగాకు రైతులను ఉద్దేశించి ఉద్వేగంగా మాట్లాడారు. వారికి కనీస మద్దతు కోసం చంద్రబాబు సర్కార్‌కు 10 రోజులు గడువు ఇచ్చి అప్పటికీ ధర పెంచకుంటే సమరశంఖం పూరిస్తానని  హెచ్చరికలు జారీచేసి రైతుల్లో మనోధైర్యాన్నినింపారు.
తూర్పుగోదావరి జిల్లా పాత రామవరంలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement