ఎంటెక్.. ఉత్త టెక్కే!
- అధ్యాపకులు, వారి సర్టిఫికెట్లూ బోగస్సే
- ఎంటెక్‌లో 550 సీట్లు, ఎంఫార్మసీలో 250 సీట్ల కోత
యూనివర్సిటీ : ఇంజనీరింగ్ విద్యా ప్రమాణాలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. జేఎన్‌టీయూ (ఏ) పరిధిలో రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలో 10 వేలమంది విద్యార్థులు ఎంటెక్‌ను అభ్యసిస్తున్నారు. జేఎన్‌టీయూ అధికారులు ప్రతి ఏటా నిజనిర్ధారణ కమిటీ కళాశాల మౌలిక సదుపాయాలు, బోధన సిబ్బంది, ల్యాబొరేటరీ, గ్రంథాలయం వంటి అంశాలను పరిశీలించి నివేదికను అందిస్తుంది. తనిఖీల సమయంలో మాత్రం మొబైల్ ప్యాకింగ్ చేస్తున్న కళాశాలలు, తరువాత గాలికి వదిలేస్తున్నాయి. ఏఐసీటీఈ తనిఖీల్లో ఈ లోటుపాట్లు కనిపిస్తూనే ఉన్నాయి.
దాగుడు మూతలు : ఒక కళాశాలలో ఉన్న వారినే మరో కళాశాల అధ్యాపకులుగా చూపించడం, అర్హతలు లేకున్నా బోధన సిబ్బందిని నియమించడం, కొంత మంది అర్హతలతో రికార్డులు సృష్టించుకొన్నా వారి సర్టిఫికెట్ బోగస్ అని నిర్ధారణ అవుతున్నాయి. చాలా కళాశాలల్లో అర్హత పత్రాలు చూస్తే అటువంటి వర్సిటీలు దేశ, విదేశాల్లో కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బీటెక్‌లలో సీట్లు అరకొరగా భర్తీ అవుతున్నా, ఎంటెక్‌లో మాత్రం సీట్లు పూర్తి స్థాయిలో భర్తీ అవుతున్నాయి. ఒక్క జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో 4 వేల మంది విద్యార్థులు కళాశాలల్లో అడుగు పెట్టకుండానే ఎంటెక్ పట్టా అందుకొంటున్నారు. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని జేఎన్‌టీయూ బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. అయితే బయోమెట్రిక్‌ను ట్యాంపర్ చేసి పరీక్షలకు హాజరు శాతాన్ని చూపిస్తున్నారు. పంపిన డేటా నకిలీదా? సరైనదా? అని తేల్చడానికి వర్సిటీ వద్ద సరైన యంత్రాంగం లేకపోవడంతో ఇవి అలంకారప్రాయంగానే కళాశాలలో ఉండిపోయాయి.
ఎం ఫార్మసీ అడ్మిషన్ పొందితే... : గతేడాది ఎంఫార్మసీ సీట్లు నింపుకోవడానికి విద్యార్థులకు ఉచితంగా ైబె క్, ల్యాప్‌టాప్ కంప్యూటర్లు ఇచ్చారు. ఒక్కో విద్యార్థికి రూ.2లక్షలు ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా వస్తుంది. దీంతో విద్యార్థి తరగతులకు హాజరైనట్లు చూపుతున్నా రు. ఎంటెక్ కోర్సు రెండేళ్లకు రూ.1,14,000 వస్తుండడంతో తాయిలాలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో పీజీఈ సెట్ కౌన్సెలింగ్ మంగళవారం ప్రారంభమైంది. సెప్టెంబర్ 3వరకు అనంతపురంతోపాటు మరో మూడు హెల్ప్‌లైన్ సెంటర్లలో విద్యార్థుల సర్టిఫికెట్స్ పరిశీలన నిర్వహిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు, వసతులను దృష్టిలో ఉంచుకుని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (ఏ) పరిధిలో 550 ఎంటెక్ సీట్లు, 250 ఎం.ఫార్మసీ సీట్లు కోత విధించారు.