సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన 1381 కేజీల బంగారం వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్‌వీ సుబ్రహ్మణ్యం విచారణకు ఆదేశించారు. ఇందుకోసం స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్ సింగ్‌ను విచారణాధికారిగా నియమించారు.ఈ నెల 23వ తేదీలోగా దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే తిరుమలకు వెళ్లి విచారణ జరపాలని సీఎస్ ఆదేశించారు. టీటీడీ బంగారం తరలింపులో భద్రతా లోపాలపై వస్తున్న వదంతులపై విచారణ చేయాలని, టీటీడీ, విజిలెన్స్ అధికారులు సమర్ధవంతంగా వ్యవహరించారా లేదా అనేదానిపై దర్యాప్తు చేయాలని సూచించారు.
చదవండి....పట్టుబడిన బంగారం టీటీడీదేనా?
కాగా శ్రీవారికి చెందిన 1,381 కిలోల నగలను చెన్నై ప్రయివేట్ బ్యాంకు నుంచి తిరుపతికి తీసుకొస్తుండగా ఈ నెల 17న తమిళనాడు పోలీసులు పట్టుకున్నారు. ఆ నగలకు సంబంధించిన పత్రాలను బ్యాంకు అధికారులు గానీ, టీటీడీ అధికారులుగానీ తరలింపు వాహనంలో ఉంచుకోకపోవడంతో పోలీసులు అనుమానించి సీజ్ చేశారు. ఈ విషయమై మీడియాల్లో కథనాలు రావడంతో స్పందించిన బ్యాంకు, టీటీడీ అధికారులు నగలకు చెందిన పత్రాలను తమిళనాడు పోలీసులకు చూపించిన నాలుగు రోజుల అనంతరం శనివారం తిరుపతికి తీసుకు వచ్చారు. అయితే నిన్న బాగా చీకటిపడ్డాక ఆ నగలను టీటీడీ పరిపాలనా భవనానికి తీసుకురావడం, కనీస భద్రత లేకుండా తరలించడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment