ఆంధ్రప్రదేశ్ ఏజీగా వేణుగోపాల్!
అదనపు ఏజీగా దమ్మాలపాటి శ్రీనివాస్?
నేడు ఉత్తర్వులు వెలువడే అవకాశం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా సీనియర్ న్యాయవాది పరాంకుశం వేణుగోపాల్ నియమితులు కానున్నారు. ఆయన నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు గురువారం వెలువడే అవకాశాలున్నాయి. అదనపు అడ్వొకేట్ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్ పేరు ఖరారైనట్లు తెలిసింది. ఆయన నియామకపు జీవో కూడా గురువారం వెలువడే అవకాశం ఉంది. ఏజీ పదవికి పలువురి పేర్లు వినిపించినప్పటికీ, అనూహ్యంగా పి.వేణుగోపాల్ పేరు ఖరారైంది. వేణుగోపాల్ పూర్వీకులు ఒరిస్సాలోని బరంపురంకు చెందిన వారు. తరువాత కాలంలో వారి కుటుంబం సికింద్రాబాద్‌లో స్థిరపడింది. 1954 నవంబర్ 23న వేణుగోపాల్ జన్మించారు. ఆయన విద్యాభ్యాసం మొత్తం సికింద్రాబాద్‌లోనే సాగింది.
1977లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అదే ఏడాది డిసెంబర్ 22న హైకోర్టు న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాది ఎన్.వి.రంగనాథన్ వద్ద జూనియర్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1983లో అడ్వొకేట్ జనరల్‌కు సహకరించేం దుకు ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా నియమితులై 1989 వరకు ఆ బాధ్యతలు నిర్వర్తించారు. వేణుగోపాల్ 2002-03లో హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్‌గా ఉన్నారు.