'ఎవరినీ ఇబ్బంది పెట్టి భూములు సేకరించలేదు'
హైదరాబాద్ : ఏపీ రాజధాని గ్రామాల్లో గురువారం సినీ నటుడు పవన్ కల్యాణ్ చేసిన పర్యటనపై ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖా మంత్రి పల్లె రఘునాధ్ రెడ్డి స్పందించారు. పవన్ ఏమన్నారో తమ దృష్టికి రాలేదని, తమ ప్రభుత్వం ఏర్పడటానికి పవన్ తో పాటు అన్ని వర్గాల సహకారం ఉందని మంత్రి రఘునాధ్ రెడ్డి అన్నారు. అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని , ఎవరైనా ఏ అంశంపైనైనా మాట్లాడవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే రాజధాని కోసం తమ ప్రభుత్వం ఎవరినీ ఇబ్బంది పెట్టి భూములు సేకరించలేదన్నారు. 50-100 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే రాజధాని నిర్మించాలనుకుంటున్నామని మంత్రి పల్లె రఘునాధ్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు తమ ప్రభుత్వం 22 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ చేసిందని మంత్రి చెప్పారు.