మంచికి మద్దతు.. చెడుకు వ్యతిరేకం | Evil is the opposite of good support ..says ys jaganmohanreddy | Sakshi
Sakshi News home page

మంచికి మద్దతు.. చెడుకు వ్యతిరేకం

Published Sun, Jun 1 2014 1:17 AM | Last Updated on Tue, Oct 16 2018 3:40 PM

మంచికి మద్దతు.. చెడుకు వ్యతిరేకం - Sakshi

మంచికి మద్దతు.. చెడుకు వ్యతిరేకం

కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఏ పని చేసినా గుడ్డిగా వ్యతిరేకించకుండా తలపెట్టిన కార్యక్రమం మంచిదైతే మద్దతునివ్వాలని.. ప్రజా వ్యతిరేకమైనదైతే ప్రతిఘటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్ణయించింది.

కేంద్రంలో ఎన్‌డీఏకు అంశాల వారీ మద్దతు
రాష్ట్ర, దేశ ప్రయోజనాల పరిరక్షణకే ప్రాధాన్యం
పార్లమెంటు సమావేశాల్లో నిర్మాణాత్మక పాత్ర
పార్టీ ఎంపీలకు జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు
పార్లమెంటరీ పార్టీ నేతగా మేకపాటి నియామకం

 
 హైదరాబాద్:  కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఏ పని చేసినా గుడ్డిగా వ్యతిరేకించకుండా తలపెట్టిన కార్యక్రమం మంచిదైతే మద్దతునివ్వాలని.. ప్రజా వ్యతిరేకమైనదైతే ప్రతిఘటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్ణయించింది. కొత్తగా ఎన్నికైన పార్లమెంటరీ పార్టీ శనివారం పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆయన క్యాంపు కార్యాలయంలో సమావేశమైంది. పార్లమెంటరీ పార్టీ నేత ఎన్నికతో పాటు జూన్ 4వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చించారు. సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాల మేరకు లోక్‌సభ సీనియర్ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డిని పార్లమెంటరీ పార్టీ నేతగా జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. ఆయనతో పాటు మొత్తం కార్యవర్గం ఎంపిక పూర్తయ్యింది. పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి (నెల్లూరు), వెలగపల్లి వరప్రసాద రావు (తిరుపతి), కొత్తపల్లి గీత (అరకు), బుట్టా రేణుక (కర్నూలు), పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి (రాజంపేట), వై.వి.సుబ్బారెడ్డి (ఒంగోలు), వై.ఎస్.అవినాష్‌రెడ్డి (కడప), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (ఖమ్మం)లు హాజరైన ఈ సమావేశం గంటన్నర పాటు సాగింది. రాష్ట్ర, దేశ ప్రయోజనాలను పరిరక్షించే క్రమంలో పార్టీ ముందుండాలని సమావేశంలో పార్టీ ఎంపీలకు జగన్ పిలుపునిచ్చారు. లోక్‌సభలో తొలి నుంచి ప్రతిపక్షంలో కీలకపాత్ర పోషిస్తున్న అనేక పార్టీల బలం కుదించుకుపోయిన పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు కీలకపాత్ర పోషించాలని చెప్పారు. అంశాల వారీగా కేంద్రానికి మద్దతు ఉంటుందని, మంచికి మద్దతునిస్తూ చెడు నిర్ణయాలను వ్యతిరేకించాలని నిర్దేశించారు.

 నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాం: మేకపాటి

 సమావేశం అనంతరం సహచర ఎంపీలతో కలసి మేకపాటి మీడియాతో మాట్లాడుతూ, ఎన్‌డీఏ ప్రభుత్వానికి తాము అంశాల వారీగా మద్దతునిస్తామని చెప్పారు. లోక్‌సభలో ప్రతిపక్ష స్థానాల్లో జాతీయ స్థాయి పార్టీలకన్నా ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ స్థానాలు ఉన్నాయని.. అన్నా డీఎంకేకు 37, తృణమూల్ కాంగ్రెస్‌కు 34, బీజేడీకి 20, టీఆర్‌ఎస్‌కు 11, సీపీఎంకు 9 స్థానాలు ఉన్నాయని, ఎస్.పి.వై.రెడ్డి కూడా తమతో ఉండి ఉంటే తమకూ 9 ఎంపీ సీట్లుండేవని పేర్కొన్నారు. అయినా ఇపుడున్న 8 మంది ఎంపీలతో నిర్మాణాత్మక పాత్రను పోషిస్తామన్నారు. ప్రతి అంశాన్నీ వ్యతిరేకించబోమని.. దేశ, రాష్ట్ర క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటామని, దేశ క్షేమానికి భంగం కలిగినట్లుగా భావిస్తే వ్యతిరేకిస్తామన్నారు.

పార్లమెంటరీ పార్టీ నేతగా మేకపాటి

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సీనియర్ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. రాజమోహన్‌రెడ్డి పార్టీ లోక్‌సభాపక్షం నేతగా కూడా వ్యవహరిస్తారు. పార్లమెంటరీ పార్టీ ఉప నాయకురాలిగా కొత్తపల్లి గీత, కార్యదర్శిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోశాధికారిగా బుట్టా రేణుక, విప్‌గా వై.వి.సుబ్బారెడ్డిని జగన్ నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. పార్టీకి జాతీయ అధికార ప్రతినిధులుగా వి.వరప్రసాదరావు, వై.ఎస్.అవినాష్‌రెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డిలను నియమించారు. వీరిలో మిథున్‌రెడ్డి పార్లమెంటరీ పార్టీ కోఆర్డినేటర్‌గా కూడా వ్యవహరిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement