ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. స్ట్రాంగ్ రూమ్‌ల భద్రత ఏర్పాట్లపై అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. 2014 సాధారణ ఎన్నికల ప్రక్రియ ఈ నెల 12న ప్రారంభమై మే 7న పోలింగ్ జరగనున్న దృష్ట్యా ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగే వరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 24 గంటలూ ప్రత్యేక సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయనున్నామన్నారు.
ఇందుకోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేసి ప్రతిక్షణం పోలీస్ పహారాతో స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతాచర్యలు అమలు చేస్తామని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌కు రెండు ద్వారాలు ఉంటే ఒక ద్వారాన్ని యుద్ధప్రాతిపదికపై ఇటుకల కట్టడంతో మూసివేసి కేవలం ఒక ప్రవేశద్వారాన్ని మాత్రమే ఉండేలా చూస్తామన్నారు. అగ్నిప్రమాదం, వరద ముంపునకు గురికాకుండా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను సురక్షితమైన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరుస్తామని, సీఆర్‌పీఎఫ్ పహారాతో భద్రతా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
జిల్లాలో అసెంబ్లీ, లోక్‌సభ, ఎన్నికలకు సంబంధించి అన్నీ ఏర్పాట్లు పటిష్టంగా నిర్వహించాలని ఎక్కాడా చిన్న లోపం లేకుండా సమగ్ర అవగాహనతో ఎన్నికల సిబ్బంది విధులు నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు. నిత్యం 32 రిపోర్టులకు సంబంధించిన నివేదికలను సమర్పించాలని, ముఖ్యంగా అభ్యర్థులకు అవసరమైన అనుమతులన్నీ సింగిల్ విండో ద్వారా అమలు చేయాలని సూచించారు.
ఓటర్లకు గుర్తింపు కార్డులను అందించడంలో ఎన్నికల సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఎక్కడ వినియోగించుకోవాలో అవసరమైన స్లిప్‌లను పోలింగ్‌కు రెండురోజులు ముందుగానే అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఙస్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 24 గంటలు విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, అత్యవసర సమయాలలో ప్రత్యామ్నాయంగా జనరేటర్లను కూడా సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు, డీఆర్వో కె.ప్రభాకరరావు పాల్గొన్నారు.