ఎగుమతుల వైపు మిల్లర్ల చూపు
తాడేపల్లిగూడెం : లెవీ సేకరణ విషయంలో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అనుసరిస్తున్న విధానం అస్తవ్యస్తంగా ఉండటంతో మిల్లర్లు విదేశాల వైపు చూస్తున్నారు. లెవీ కోసం సేకరించిన ధాన్యాన్ని ఆడించగా వచ్చిన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇవ్వడానికి వారెవరూ ఇష్టపడటం లేదు. ఎఫ్‌సీఐ తీరు పొమ్మనలేక పొగ పెట్టినట్టుగా ఉంది. లెవీ సేకరణ నిబంధనలు మారాయని చెబుతున్న ఎఫ్‌సీఐ అధికారులు ఆ ఉత్తర్వుల వివరాలను గోప్యంగా ఉంచుతూ తమను ఇబ్బందుల పాలు చేస్తున్నారని మిల్లర్లు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితిల్లో బియ్యూన్ని ఎఫ్‌సీఐకి ఇవ్వ డం కంటే విదేశాలకు ఎగుమతి చేయడమే మంచిదనే ఆలోచనకు వచ్చారు. ఇంచుమించుగా ఎఫ్‌సీఐ ఇస్తున్న ధరకే కొనుగోలు చేసేం దుకు దక్షిణాఫ్రికా నుంచి ఆర్డర్లు రావడంతో ఎగుమతిదారులు ఉభయగోదావరి జిల్లాల్లో మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలు చేస్తున్నారు.
కాకినాడ పోర్టులో వీటిని నిల్వచేసి, ఎల్‌సీలు ఉన్న సరుకును సముద్ర మార్గంలో దక్షిణాఫ్రికాకు ఓడల ద్వారా తరలిస్తున్నారు. కాకినాడ పోర్టుకు చేరా క్వింటాల్ బియ్యానికి రూ.2,400 చొప్పున ధర చెల్లిస్తున్నారు. 25 శాతం నూకలు ఉన్న బియ్యానికి ఈ ధర లభిస్తోంది. 1010 రకం బియ్యం ఎగుమతులు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. వాస్తవానికి ఎఫ్‌సీఐ మిల్లర్ల నుంచి 25 శాతం నూకలు ఉన్న బియ్యాన్ని తీసుకోవాలి. కానీ 20 శాతం నూకలు ఉన్నా బియ్యాన్ని తీసుకునేది లేదని, ఒక్కోసారి 18 శాతం, మరోసారి 15 శాతం నూకలు మాత్రమే ఉండాలంటూ ఎఫ్‌సీఐ అధికారులు రోజుకో కొత్త మెలిక పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వెంటనే సొమ్ములు చేతిలో పడే అవకాశం ఉండటంతో ఎగుమతుల వైపు మిల్లర్లు దృష్టి సారించారు.
దక్షిణాఫ్రికాకు ఎగుమతి చేసేందుకు ఒక్క పశ్చిమగోదావరి జిల్లానుంచే 10 వేల టన్నుల వరకు బియ్యూన్ని కొనేందుకు ఎగుమతిదారులు ముందుకొచ్చారు. కాకినాడ నుంచి ఎగుమతులు చేసే ఓ కంపెనీ ప్రతినిధులు, భీమవరానికి చెందిన ఇద్దరు ప్రతినిధులు జిల్లాలో జోరుగా బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. మిల్లర్లకు దక్షిణాఫ్రికా తరఫున లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి భారీ స్థాయిలో దక్షిణాఫ్రికాకు బియ్యం ఎగుమతి అవుతున్నాయి. గత లెవీలో సేకరించిన ధాన్యం నిల్వలు మిల్లర్ల వద్ద పుష్కలంగా ఉన్నాయి. లెవీగా సేకరించిన ధాన్యాన్ని ఆడించగా వచ్చిన బియ్యంలో 75 శాతం ఎఫ్‌సీఐకి లెవీగా మిల్లర్లు ఇవ్వాలి.
మిగిలిన 25 శాతం బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు విక్రయించుకునే వెసులుబాటు మిల్లర్లకు ఉంది. గత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో సేకరించిన ధాన్యం ఆడించగా వచ్చిన బియ్యంలో 25 శాతం విక్రయించుకునే అవకాశం ఉన్నా, అందులో కేవలం సగం సరుకును విక్రయించుకునేందుకు మాత్రమే మిల్లర్లకు అనుమతులు వచ్చాయి. దీంతో సగం సరుకు మిల్లుల్లోనే ఉండిపోయింది. ఒకపక్క ఎఫ్‌సీఐ అసంబద్ధ విధానాలు, మరోపక్క లెవీ సేకరణ శాతంపై కమ్ముకున్న నీలినీడలు మిల్లర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారుు. ఈ తరుణంలో ఎగుమతికి అనుమతులు లభించడం మిల్లర్లకు ఊరట కలిగిస్తోంది. దీంతో వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డారు.