సాక్షి, హైదరాబాద్: సినీనటుడు ఉదయ్‌కిరణ్ అంతియయాత్రకు పెద్దసంఖ్యలో అభిమానులు తరలిరావడంతో శ్మశానవాటికకు వచ్చే రహదారులు కిక్కిరిసిపోయాయి. దారిపొడవునా, అంతకుముందు ఫిలిం చాంబర్ వద్ద అభిమానులు చిరంజీవికి, అల్లు అరవింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిరంజీవితోపాటు నాగబాబు, పవన్‌కల్యాణ్, రాంచరణ్ తేజ్, అల్లు అరవింద్ ఫిలిం చాంబర్‌కు రాకపోవడం చర్చనీయాంశమైంది.
కొన్ని శక్తులు అవకాశాలు రాకుండా చేశాయి: దాసరి
సినీనటుడు ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య కొందరి వల్లే జరిగిందని దర్శకరత్న దాసరి నారాయణరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిలించాంబర్‌లో ఆయన మాట్లాడుతూ.. కొన్ని శక్తులు ఉదయ్ కిరణ్‌కు అవకాశాలు దక్కకుండా చేశాయని, ఆ పాపం వల్లే ఇలా జరిగిందని వ్యాఖ్యానించారు.
అభిమానుల అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు
మంగళవారం ఎర్రగడ్డలోని ఈఎస్‌ఐ హిందూ శ్మశానవాటికలో ముగిశాయి. తండ్రి వి.వి.కె.మూర్తి చితికి నిప్పంటించారు. సినీ ప్రముఖులు, టీవీ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు ఆయన అభిమానులు పెద్దసంఖ్యలో అంత్యక్రియలకు హజరయ్యారు. అంతకుముందు ఉదయ్ భౌతిక కాయాన్ని నిమ్స్ నుంచి శ్రీనగర్ కాలనీలోని జ్యోతి హోమ్స్ అపార్ట్‌మెంట్స్ వద్దకు తీసుకువెళ్లారు. తర్వాత ఫిలిం చాంబర్‌కు తరలించారు. ఉదయ్ మృతదేహాన్ని కడసారి చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు, దర్శకరత్న దాసరి నారాయణరావు, సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, నటులు వెంకటేష్, శ్రీకాంత్, అల్లరి నరేష్, సునీల్, వరుణ్ సందేశ్, తనీష్, కాదంబరి కిరణ్‌కుమార్, తనికెళ్ల భరణి, చలపతిరావు, జయసుధ, నిర్మాత సురేష్‌బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, ఆదిశేషగిరిరావు, జీవిత, రాజశేఖర్, శివబాలాజీ, చలపతిరావు, హేమ తదితరులు ఉదయ్ భౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు. ఆయన మృతి వార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నామని పలువురు కన్నీరుమున్నీరయ్యారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించారు.