రాజధానిపై ప్రజలకు అపోహలున్నాయి
-మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి
కంబాలచెరువు : నూతన రాజధానిపై ప్రజలకు ఎన్నో అపోహలున్నాయని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వాటన్నింటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో రాజీవ్‌గాంధీ డిగ్రీ కళాశాల రజతోత్సవానికి హాజరైన ఆయన సోమవారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. తాము అధికారంలో ఉండగా రైతులకు లక్ష రూపాయల వడ్డీ లేని రుణం ఇవ్వగా చంద్రబాబు రైతుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.
తాము పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించామని, ప్రస్తుతం ఆరు లక్షల ఇళ్లు మధ్యలోనే ఆగిపోయాయని చెప్పారు. డ్వాక్రా మహిళలను ఆదుకునేందుకు వారికిచ్చే రుణాలకు సంబంధించి రూ.1800 కోట్లు వడ్డీకే చెల్లించామన్నారు. చంద్రబాబు రుణాలు ఇస్తున్నా మహిళల నుంచి 14 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్ర, తెలంగాణ ఇరు రాష్ట్రాలకూ ఉన్న తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి నీటిని సాధించుకోవాలని సూచించారు.