సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద లబ్ధి పొందేందుకు ఫ్రెష్ విద్యార్థుల రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఫ్రెష్ విద్యార్థులు ఈపాస్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు మంగళవారం నుంచి అవకాశం కల్పించారు. ప్రస్తుతానికి డిగ్రీ కోర్సులకు మాత్రమే అవకాశమిస్తున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ తెలిపారు. ఇంటర్ కోర్సుల ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత త్వరలోనే ఇంటర్ విద్యార్థులకు అవకాశమిస్తామని మంగళవారం ‘సాక్షి’తో ఆయన పేర్కొన్నారు. అయితే దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి గడువు విధించడం లేదు.
ఎందుకంటే ఆధార్‌కు సంబంధించిన యూఐడీ నంబర్‌ను ఈ-పాస్ వెబ్ సైట్‌లో నమోదు చేస్తేనే దరఖాస్తు ఓపెన్ అవుతుంది. దాదాపు 40 శాతం మంది విద్యార్థులకు ఆధార్ లేదని గణాంకాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో గడువు విధించలేదని, యూఐడీ నంబర్ నమోదు చేస్తే దరఖాస్తు లభించేలా ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పారు. ఈ-పాస్ వెబ్‌సైట్‌లో టెన్‌తక్లాస్ వివరాలు సమర్పించిన తర్వాత ఆధార్ యూఐడీ నంబర్‌ను రెండుసార్లు, మొబైల్ నంబర్‌ను రెండు సార్లు నమోదు చేయాలి. వెంటనే విద్యార్థి మొబైల్ నంబర్‌కు వచ్చిన పాస్‌వర్డ్‌ను నమోదు చేస్తేనే దరఖాస్తు లభిస్తుందని అధికారులు సూచించారు. త్వరగా యూఐడీ నెంబర్ పొందితే పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నిబంధన ఫ్రెష్, రెన్యువల్ విద్యార్థులకు వర్తిస్తుంది.
ఫీజుల పథకంలో ఫ్రెష్ విద్యార్థులకు ఛాన్స్
Published Wed, Aug 7 2013 5:44 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
Advertisement