సయోధ్య కుదుర్చుకోవడానికి గ్రామ పెద్దల సమక్షంలో సమావేశమైన ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడికి దిగిన ఘటనలో 25 మందికి గాయాలయ్యాయి.
విజయనగరం: సయోధ్య కుదుర్చుకోవడానికి గ్రామ పెద్దల సమక్షంలో సమావేశమైన ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడికి దిగిన ఘటనలో 25 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన విజయనగరం జిల్లా తెర్లాం మండలం నందిగామ గ్రామంలో బుధవారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన ఒకే సామాజిక వర్గానికి చెందిన కొందరు వ్యక్తుల మధ్య గతంలో గొడవ జరిగింది. దానికి సంబంధించి ఒక పరిష్కారం చేసుకోవడానికి బుధవారం గ్రామపెద్దల సమక్షంలో ఇరు వర్గాలు సమావేశమయ్యాయి.
ఈ క్రమంలో మాట మాట పెరిగి ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. దీంతో 25 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి ఉద్రిక్తం కాకుండా నియంత్రించి క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.