అవినీతికి వ్యతిరేకంగా పోరాడే బాధ్యత ఎర్రజెండా పార్టీలదేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ చెప్పారు.
గోదావరిఖని, న్యూస్‌లైన్ : అవినీతికి వ్యతిరేకంగా పోరాడే బాధ్యత ఎర్రజెండా పార్టీలదేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ చెప్పారు. ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూని యన్ 14వ మహాసభల సందర్భంగా గోదావరిఖనిలో ఆదివా రం రాత్రి నిర్వహించిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో మద్యం మాఫియా, బస్సుల మాఫియా, ల్యాండ్ మాఫియా తదితర మాఫియాల ఆధ్వర్యంలోనే సమాంతర పరిపాలన సాగుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేవలం ఉత్సవ విగ్రహంగానే పనిచేస్తున్నారన్నారు.
రాజకీయ పార్టీలు కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసం దిగజారిపోయి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చించకుండా కాంగ్రెస్ పార్టీ రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తోందని, ఒకవేళ ఆ పార్టీ తెలంగాణపై వెనక్కి తగ్గితే పాతాలగంగలో కలిసినట్టేనని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నేడు బీజేపీతో స్నేహం చేస్తున్నారని, తెలంగాణకు అడ్డుతగులుతూ బిల్లు రాకుండా ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలకు ఢిల్లీలో పట్టిన గతే రాష్ట్రంలో పడుతుందని ఎద్దేవా చేశారు. ప్రజలు ఎర్రజెండా నాయకత్వాన్ని ఆదరించాలని కోరారు.
తెలంగాణకు కిరణే అడ్డంకి
తెలంగాణ బిల్లుపై శాసనసభలో చర్చించకుండా అడ్డుకుంటున్నది సీఎం కిరణేనని సీపీఐ శాసనసభపక్ష నేత గూండా మల్లేశ్, ఉపనేత కూనంనేని సాంబశివరావు ధ్వజమెత్తారు. రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని చెప్పి సీఎంగా ప్రమాణం చేసిన కిరణ్ మాట తప్పి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీని సజావుగా నడిపించాలని, సభను అడ్డుకునేవారిని మార్షల్స్‌తో బయటకు పంపించాలని సూచించారు. సభలో ఎమ్మెల్సీ, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పీజే చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి ఓబులేశు, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శులు మర్రి వెంకటస్వామి, కళవేణి శంకర్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పువ్వాడ నాగేశ్వర్‌రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ వై.గట్టయ్య, ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.