నామినేటెడ్ కోసం... ఆధిపత్య పోరు | Fighting for the dominant nominated | Sakshi
Sakshi News home page

నామినేటెడ్ కోసం... ఆధిపత్య పోరు

Published Sat, Dec 13 2014 2:38 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

నామినేటెడ్ కోసం... ఆధిపత్య పోరు - Sakshi

నామినేటెడ్ కోసం... ఆధిపత్య పోరు

ముఖ్య నేతల చుట్టూ తెలుగు తమ్ముళ్ల ప్రదక్షిణలు
కీలక పోస్టులపై కన్ను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం

 
నామినేటెడ్ పదవుల భర్తీలో టీడీపీ ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. తమ వర్గం వారికే పదవులు ఇప్పించుకోవాలని ఎవరికివారు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పదవులు ఆశిస్తున్న తెలుగు తమ్ముళ్లు సిఫార్సుల కోసం తమకు అనుకూలంగా ఉండే నేతల చుట్టూ  ప్రదక్షిణలు చేస్తున్నారు.
 
విజయవాడ : గత పదేళ్లుగా అధికారానికి దూరమైన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు నామినేటెడ్ పోస్టులపై దృష్టిసారిస్తున్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయించాలని ఆ పార్టీ నేతలు స్థానిక ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర సదస్సులో చంద్రబాబు పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించడంతో పాటు కాంగ్రెస్ హయాంలో ఉన్న వివిధ కమిటీలను రద్దు చేయడంతో ద్వితీయ శ్రేణి నేతలు నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెంచుకున్నారు. జిల్లాలో రెండు కీలకమైన చైర్మన్ పదవులు ఉండేవి. ఉడా రద్దు కావడంతో వీజీటీఎం పాలకవర్గం పోస్టులు పోయాయి. దీంతో ప్రస్తుతం నేతలంతా దుర్గగుడి, మార్కెట్ యార్డు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవులపై దృష్టి సారించారు. సీఎం దృష్టికి సిఫార్సులు తీసుకెళ్లే యత్నాల్లో ఉన్నారు.
 
దుర్గగుడి చైర్మన్ పదవి కోసం యత్నాలు..

.
 కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సిఫార్సు మేరకు విజయవాడకు చెందిన బీజేపీ నేత వీరమాచినేని రంగప్రసాద్‌కు దుర్గగుడి చైర్మన్ పదవి ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పటివరకు చంద్రబాబు నుంచి ఆ మేరకు గ్రీన్ సిగ్నల్ రాక పోవడంతో టీడీపీ నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ నగర ఉపాధ్యక్షుడు ముష్టి శ్రీనివాస్, సీనియర్ నేతలు యలమంచిలి గౌరంగబాబు, గుడిపాటి పద్మశేఖర్ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ ముగ్గురికి ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఆశీస్సులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోపక్క మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గరిమెళ్ల నానయ్య చౌదరి పేరు సిఫార్సు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేతలంతా తమ శక్తి మేరకు రాష్ట్రస్థాయిలో పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఎంపీ, ఎమ్మెల్యేల సిఫార్సులతో జిల్లాలో ముఖ్య దేవాలయాల పాలక మండళ్ల పదవులు దక్కించుకునే ప్రయత్నాలు మరికొంతమంది నేతలు చేస్తున్నారు.

మార్కెట్‌యార్డు చైర్మన్ పదవుల కోసం పోటాపోటీ

మార్కెట్ యార్డు చైర్మన్ పదవులపై అనేక మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఆయా పదవులు దక్కించుకునేందుకు తమకు సన్నిహితంగా ఉండే ప్రజాప్రతినిధుల్ని ఆశ్రయిస్తున్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా ఉండేవారికి నామినేటెడ్ పదవులు ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లో మంత్రి  దేవినేని ఉమామహేశ్వరరావు తన మాట నెగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నందిగామలో కేవీ సాంబశివరావు, చిరుమామిళ్ల శ్రీనివాసరావు (బుజ్జి)లలో ఒకరికి ఇవ్వాలని మంత్రి సిఫార్సు చేస్తున్నట్లు సమాచారం. మైలవరంలో విషయంలో ఆయన పూర్తి గుమ్మటంగా ఉన్నప్పటికీ రాయల లీలాప్రసాద్‌కు సిఫార్సు చేయవచ్చని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఈ పదవిపై ఉమా అనుచరులు మరికొందరు కూడా కన్నేశారు. తిరువూరు మార్కెట్ యార్డు చైర్మన్ పదవికి కొరివి రామారావు, తాళ్లూరు రామారావుల పేర్లు ఎంపీ కేశినేని నాని సిఫార్సు చేయగా, ఆళ్లవాళ్ల రమేష్ రెడ్డి పేరు మంత్రి ఉమా సిఫార్సు చేస్తున్నారని సమాచారం. జగ్గయ్యపేట మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కోసం చంద్రబాబు సొంత సామాజిక వర్గంలోనే ఆధిపత్య పోరు జరుగుతోంది. ఈ పదవి కోసం మల్లెల గాంధీ, నరిసింహారావుతో పాటు మరో ఇద్దరు పోటీ పడుతున్నట్లు తెలిసింది.

బందరు పరిధిలో నేతల చుట్టూ ప్రదక్షిణలు...

బందరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎంపీ కొనకళ్ల నారాయణ, మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు ఎవరికివారు తమ వర్గం వారికి నామినేటెడ్ పదవులు ఇప్పించాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బందరుకు చెందిన ఒక మాజీ చైర్మన్ తాను ముగ్గురినీ ఒప్పించగలనంటూ కొంతమంది ద్వితీయశ్రేణి నేతల వద్ద డబ్బులు దండుకుంటున్నారని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. నామినేటెడ్ పోస్టులకు పేర్ల సిఫార్సు విషయంలో ముగ్గురు నేతలు గుమ్మటంగానే ఉన్నారు. దీంతో నేతలంతా స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement