ఎచ్చెర్ల క్యాంపస్/శ్రీకాకుళం టౌన్, న్యూస్‌లైన్: ఎచ్చెర్ల మండలంలోని కుశాలపురం పంచాయతీ పరిధి సింహద్వారం సమీపంలో జాతీయ రహదారి డివైడర్‌పై బుధవారం రాత్రి టీడీపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి దివంగత కింజరాపు ఎర్రన్నాయుడి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వివాదానికి దారితీసింది. ఎలాంటి అనుమతులు లేకుండా విగ్రహం ఏర్పాటుచేయడంపై ఎన్‌హెచ్-16 సిబ్బంది పోలీసులు, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విగ్రహం ఏర్పాటుచేసే స్థలాన్ని శ్రీకాకుళం ఆర్డీవో జి.గణేష్ కుమార్, డీఎస్‌పీ శ్రీనివాస్‌లు గురువారం పరిశీలించారు. నోటీసు జారీ చేసి తొలగించే చర్యలు చేపట్టాలని ఎచ్చెర్ల తహశీల్దార్ బి.వెంకటరావును ఆదేశించారు. అనుమతి లేనిదే విగ్రహం ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేయకూడదని, జాతీయ రహదారి మధ్యన విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
విగ్రహం తొలగించి ఎన్టీఆర్ ఎంహెచ్‌స్కూల్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం పక్కన ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్టు సమాచారం. అయితే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు చౌదిరి నారాయణమూర్తి, నాయకులు బొచ్చ కోటిరెడ్డి, చౌదిరి అవినాష్, బెండు మల్లేష్‌లు తహశీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు. అందరి విగ్రహాలు ప్రభుత్వ స్థలంలోనే ఉన్నాయని, ఈ విగ్రహం ఉంటే తప్పేమిటని అధికారులను నిలదీశారు. విగ్రహం తొలగించే చర్యలు చేపడితే ఆందోళన తప్పదని హెచ్చరించారు. కనీసం అనుమతులు లేకుండా విగ్రహం ఏర్పాటు చేయడం సరికాదని అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. టీడీపీ నాయకులు మాత్రం విగ్రం వేరేచోటుకి మార్చేందుకు అంగీకరించలేదు. నవంబర్ 2న విగ్రహాన్ని ఆవిష్కరించి తీరుతామని బాబ్జి, పీవీ రమణ, ముద్దాడ కృష్ణమూర్తినాయుడు తదితరులు స్పష్టంచేశారు. ఈ నేపధ్యంలో అధికారులు నిబంధనలు పాటిస్తారా? టీడీపీ నాయకులు అనుకున్నది సాధిస్తారా? అన్న ప్రశ్నలు అందరిలోనూ మెదలుతున్నాయి.
ఎచ్చెర్ల పోలీసులకు ఫిర్యాదు
అక్రమంగా విగ్రహం ఏర్పాటుచేశారంటూ ఆర్డీవో, తహశీల్దార్ ఆదేశాల మేరకు కుశాపురం పంచాయతీ గ్రామ కార్యదర్శి మనోరమ ఎచ్చెర్ల పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. గ్రామ పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఉదయ్‌కుమార్ చెప్పారు.
ప్రత్యామ్నాయం చూసుకోవాలి
శ్రీకాకుళం కలెక్టరేట్: ఎర్రన్నాయుడు విగ్రహం ఏర్పాటుకు ప్రత్యామ్నాయ స్థలం చూసుకోవాలని ఏజేసీ ఆర్.ఎస్ రాజ్‌కుమార్ టీడీపీ నాయకులకు సూచించారు. విగ్రహావిష్కకరణ నిలుపుదలపై టీడీపీ నాయకులు, అధికారులతో కలిసి తన ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఎవరికైనా నిబంధనల మేరకు అనుమతులు ఇస్తామని స్పష్టం చేశారు.