కాల్‌మనీ కేసులో మరో మోసం
ప్రజాప్రతినిధి బంధువుల నిర్వాకం
విజయవాడ లీగల్ : తనఖా రిజిస్ట్రేషన్ అంటూ తన ఇంటిని కాల్‌మనీ వ్యాపారి అమ్మకం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఓ వృద్ధుడు ఆరోపించారు. నగరానికి చెందిన ప్రజాప్రతినిధి బంధువు ఈ మోసానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. తన న్యాయవాది ద్వారా కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. బాధితుడి కథనం మేరకు.. 83 ఏళ్ల రేలంగి హనుమంతరావు విద్యాధరపురంలోని రావిచెట్టు సెంటర్ రేలంగివారి వీధిలో నివసిస్తున్నారు. కుటుంబ అవసరాల నిమిత్తం నగరానికి చెందిన బుద్దా భాస్కరరావు వద్ద 2015 జూలై 31న రూ.4 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ప్రతినెలా వడ్డీ చెల్లిస్తున్నారు. నగదు ఇచ్చిన రోజు హనుమంతరావు నుంచి భాస్కరరావు రూ.100 స్టాంపు పేపరు, సంతకాలు చేసిన తెల్ల కాగితాలు నాలుగు, సంతకం చేసిన ఖాళీ ప్రాంసరీ నోట్లు, నాలుగు ఖాళీ చెక్కులు తీసుకున్నారు. రెండు నెలలు తర్వాత నూటికి ఆరు రూపాయలు చెల్లించాలని భాస్కరరావు పట్టుబట్టారు.
అంతవడ్డీ చెల్లించలేనని హనుమంతరావు పేర్కొనడంతో ఇంటిని తనఖా చేస్తే వడ్డీ తగ్గిస్తానని చెప్పిన భాస్కరరావు రూ.70 లక్షల ఇంటిని తనఖా పెట్టుకున్నాడు. అయితే ఆ ఇంటిని రూ.4 లక్షలకు అమ్మినట్లుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ తరువాత రూ.6 వడ్డీ చెల్లించాల్సిందేనని పట్టుబట్టాడు. ఆ మేరకు వడ్డీ చెల్లించి తనఖా రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని కోరగా ఇంటిని తనకు అమ్మేశారుగా అంటూ హనుమంతరావును దూషించాడు. బాధితుడి అల్లుడు పలగాని మురళీ కృష్ణ ఇంటి కాగితాల కోసం వెళ్లగా భాస్కరరావు చేతనైంది చేసుకోండి, ఆ ఇంటి కాగితాలు ఓ వ్యక్తి వద్ద ఉన్నాయి అని చెప్పాడు. దీంతో బాధితులు ఆ వ్యక్తి వద్దకు వెళ్లగా తనకు సంబంధంలేదని, భాస్కరరావు వద్దే తేల్చుకోవాలని ఆ వ్యక్తి సూచించాడు.
ఈ వ్యవహారాన్ని పరిష్కరిస్తానని చెప్పిన బుద్దా సత్యనారాయణ ఆ తరువాత ఇంటిని ఇచ్చే ప్రసక్తేలేదని, ఎంతో కొంత నగదు ఇప్పిస్తామని చెప్పాడు. బుద్దా వెంకన్న బంధువు భాస్కరరావు తనను మోసగించాడని పోలీసులకు, నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని హనుమంతరావు దంపతులు వాపోయారు. ముఖ్యమంత్రికి చెప్పుకుందామని వెళ్తే, ఆయన అందుబాటులో లేరని, తమ న్యాయవాది ద్వారా కోర్టులో ప్రయివేటు కేసు దాఖలు చేయనున్నామని పేర్కొన్నారు.
తనఖా పేరిట అమ్మకం రిజిస్ట్రేషన్
Published Thu, Jan 14 2016 2:05 AM | Last Updated on Sun, Sep 3 2017 3:37 PM
Advertisement