మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది కన్నీటి పర్యంతమవుతున్న బాధితులు
నెల్లూరు(క్రైమ్): విద్యుత్‌షార్ట్ సర్క్యూట్ లేదా, సిలిండర్ పేలిందో తెలియదుకానీ నెల్లూరులోని పాతనగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలోని జయలలితానగర్‌లో గురువారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు దట్టంగా వ్యాపించడంతో సుమారు 15 ఇళ్ల వరకు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో బాధిత కుటుంబసభ్యులు కట్టుబట్టలతో రోడ్డుపైపడ్డారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.6 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి.
పాతనగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలో జయలలితానగర్ ఉంది. సుమారు 200 కుటుంబాలు పూరిళ్లు, రేకులు ఇళ్లు నిర్మించుకుని నివాసముంటున్నారు. అందరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గురువారం సాయంత్రం ఓ ఇంట్లో నుంచి భారీ శబ్దం రావడంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా ఉలిక్కిపడి ఏం జరిగిందోనని బయటకు పరుగులు తీశారు. అప్పటికే మంటలు ఎగిసిపడుతూ పక్కనే ఉన్న పూరిగుడిసెలకు వ్యాపించాయి. క్షణాల్లో అవి అగ్నికి ఆహుతయ్యాయి. ఊహించని ఈ పరిణామంతో ఖంగుతిన్న బాధిత కుటుంబసభ్యులు తేరుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇళ్లలోని వస్తువులు దగ్ధమయ్యాయి. సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంతో ఆ ప్రాంతంలో విద్యుత్‌సఫరా నిలిచిపోయింది.
మంటలు వ్యాపించకుండా..
అగ్నిమాపక శాఖ జిలా అధికారి ధర్మారావు, నెల్లూరు కేంద్ర అధికారి శ్రీనివాసరావులు టార్చ్‌లైట్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు ఇతర ఇళ్లకు వ్యాపించకుండా కట్టడిచేయడంతో పెనుప్రమాదం తప్పింది. విద్యుత్‌వైర్లు కిందగా ఉండటంతో షార్ట్ సర్యూట్ వల్లనే ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక శాఖ అధికారులు భావిస్తుండగా, స్థానికులు మాత్రం గ్యాస్‌సిలిండర్ పేలడంవల్లనే ప్రమాదం జరిగిందని పేర్కొంటున్నారు. శుక్రవారం సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తామని అధికారులు
వెల్లడించారు.
తరచూ ఇలాంటి ఘటనలే....
అగ్నిప్రమాదాలు ఈ ప్రాంత వాసులకు కొత్తేమీ కాదు. గతంలోనూ ఇదే తరహాలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుని పలువుర్ని రోడ్లుపాలుచేశాయి. పైసాపైసా కూడపెట్టుకుని నిర్మించుకున్న ఇళ్లు అగ్నికి ఆహుతికావడంతో గుండెలవిసేలా రోదించారు. తమను తక్షణమే ఆదుకోవాలని బాధితులు కోరారు. ఇదిఉండగా ప్రమాద సమయంలో దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికంగా ఉండే ఓ మహిళ సొమ్మసిల్లిపోయింది. దీంతో స్థానికులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
పలువురి పరామర్శ
ప్రమాదఘటనపై సమాచారం అందుకున్న ఆర్డీఓ చిన్నికృష్ణ, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌లీడర్ పి.రూప్‌కుమార్‌యాదవ్, తహసీల్దార్, రెవెన్యూ సిబ్బందిలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొన్నారు. ప్రమాదస్థలిని పరిశీలించి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. పెన్నానది పక్కనే ఈ ప్రాంతం ఉండటంతో భవిష్యత్‌లో ముంపునకు గురైయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా హౌస్‌ఫర్ ఆల్‌లో పక్కాఇళ్లు కేటాయిస్తామని ఈ సందర్భంగా నగర మేయర్ పేర్కొన్నారు. బాధితులను రూప్‌కుమార్‌యాదవ్ ఓదార్చారు. సత్వర న్యాయం జరిగేలా చూస్తామని హామీఇచ్చారు. అధికారులు బాధితులకు బస ఏర్పాటుచేసి అవసరమైన సహాయ చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment