ఉలిక్కిపడిన సిక్కోలు | FIRE WORKS FACTORY EXPLOSION IN SRIKAKULAM | Sakshi
Sakshi News home page

ఉలిక్కిపడిన సిక్కోలు

Published Mon, Feb 16 2015 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 9:23 PM

ఉలిక్కిపడిన సిక్కోలు

ఉలిక్కిపడిన సిక్కోలు

 వంగర: సిక్కోలు జిల్లా మరోసారి ఉలిక్కిపడింది. ఆరు నెలల క్రితం జి.సిగడాం మండలం పెనసాం గ్రామంలో బాణసంచా అక్రమ తయారీ కేంద్రంలో సంభవించిన పేలుడులో ఇద్దరు మృత్యువాత పడగా పలువురు గాయపడిన ఘటనను మరచిపోకముందే అలాంటి ఘటనే వంగర మండలం మరువాడ పంచాయతీ కొత్త మరువాడ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఇక్కడ కూడా బాణసంచా అక్రమ తయారీ కేంద్రంలో పేలుడు సంభవించిన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
 
 వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఎరుకుల కులస్తులైన గేదెల పోలీస్, భాస్కరరావులు ఎలాంటి అనుమతి లేకుండా తమ ఇళ్ల వద్ద వివాహాలు, పండుగలు, ఇతరత్రా కార్యక్రమాల కోసం బాణసంచాను తయారు చేస్తుంటారు. ఇదే క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాణసంచాను తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో ఏమి జరిగిందో తేలియక గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. బాణసంచా పేలిందని తెలుసుకొని తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రసాయన పదార్థాలు అధిక మోతాదులో వినియోగించడం, లేదా పొగత్రాగడం వల్ల పేలుడు సంభవించి ఉంటుందని సంఘటన స్థలాన్ని సందర్శించిన ఎస్పీ ఏఎస్‌ఖాన్ అనుమానం వ్యక్తం చేశారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
 
 ఘటనలో బాణసంచా తయారీదారులైన పోలీస్, భాస్కరరావులతో పాటు అదే కుటుంబానికే చెందిన గేదెల శ్రీనివాసరావు, రాములమ్మలు, అక్కడే ఉన్న పాలకొండ మండలం బాసూరు గ్రామానికి చెందిన చెవ్వూరు దుర్గారావు, విజయనగరం జిల్లా బలిజిపేట మండలం జనార్థనవలస గ్రామానికి చెందిన ఇరువాడ గణపతి, ఆడుకోవడానికి వెళ్లిన కొత్తమరువాడ గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలిక పోల అపర్ణ తీవ్రంగా గాయపడ్డారు. శరీరమంతా కాలిపోవడంతో క్షతగాత్రులు మృత్యువుతో పోరాడుతున్నారు. వీరిలో గేదెల భాస్కరరావు, శ్రీనివాసరావు, గణపతిరావు, అపర్ణల శరీరం ఎక్కువ శాతం కాలిపోయాయి. మరో ముగ్గురి పరిస్థితి కూడా అలాగే ఉంది. స్థానికుల సమాచారం మేరకు 108 వాహనాల్లో క్షతగాత్రులను రాజాం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం జిల్లా కలెక్టర్ పి.నరసింహం ఆదేశాల మేరకు విశాఖపట్నం కేజీహెచ్‌కు అంబులెన్స్‌ల్లో తరలిస్తుండగా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సమీపంలో ఇరువాడ గణపతి(35) మృతి చెందగా, చిన్నారి అపర్ణ(6) విశాఖ కేజీహెచ్‌లో తుదిశ్వాస విడిచింది.
 
 ధ్వంసమైన ఇళ్లు
 పేలుడు ధాటికి గేదెల పోలీస్, భాస్కరావుల ఇళ్లు పూర్తిగా ధ్వంసమవ్వగా పక్కనే ఉన్న గీరసన్యాసి శ్రీను ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. రెండు మోటారు వాహనాలు, టీవీలు, ఫ్యాన్లు, విద్యుత్ పరికరాలు, నిత్యావసర సరుకులు, తిండిగింజలు, దుస్తులు, వివిధ ధ్రువీకరణ పత్రాలతోపాటు పేలుడు పదార్థాలు ధ్వంసమయ్యాయి. రాజాం అగ్నిమాపక కేంద్రం సిబ్బంది మంటలను అదుపు చేశారు.  
 
 భారీగా పేలుడు పదార్థాల గుర్తింపు
 సంఘటన స్థలాన్ని ఆనుకొని ఉన్న రేకుల షెడ్డులో భారీగా నిల్వ చేసి ఉన్న పేలుడు పదార్థాలను పోలీసులు గుర్తించారు. ట్రైనైట్రో టోలిన్, పాస్పరస్, అమోనియం, పొటాషియం, క్లోరైట్, గన్  ఫౌడర్, గంధకం, సురాకారం తదితర పేలుడు గుణం కలిగిన పదార్థాలను కనుగొన్నారు. ఇనుప చువ్వలు, ఇనుప తివ్వలు కుప్పలు ఉండటాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. బాణసంచా తయారీ కేంద్రానికి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేవు. విజయనగరం జిల్లాలోని విజయనగరం, బొబ్బిలి ప్రాంతాల ఏజెంట్లు పేలుడు పదార్థాలను  వీరికి సరఫరా చేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు.  
 
 గ్రామస్తుల భయాందోళన
 బాణసంచా పేలుడుతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పేలుడు శబ్దానికి చిన్నపిల్లలు సైతం సమీప పంటపొలాల్లోకి పరుగులు పెట్టారు. కాసేపటికి బాణాసంచా తయారీ కేంద్రం వద్ద భారీగా మంటలు చెలరేగడంతో పెద్దవాళతా అక్కడకు చేరుకొని అదుపుచేసే ప్రయత్నం చేశారు. కాలిపోయిన వారిని చూసి కన్నీరుమున్నీరయ్యారు. శరీరం రక్తసిక్తమై శరీరాలను కుటుంబీకులు రోదించారు. పోల మహేష్, కుమారిలు పొలం పనులు కోసం వెళ్లడంతో వారి ఆరేళ్ల కుమార్తె అపర్ణ బాణసంచ తయారీ కేంద్రం వద్దకు వెళ్లి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో కన్నుమూయడంతో వారు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
 
  బాణసంచా అక్రమ తయారీదారులపై చర్యలు
 బాణసంచా అక్రమ తయారీదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఏఎస్ ఖాన్ స్పష్టం చేశారు. కొత్తమరువాడలో పేలుడు స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ గ్యాస్, విద్యుత్‌షార్ట్‌సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించలేదన్నారు. పేలుడు పదార్థాల వద్ద పొగ త్రాగడం లేదా బాణసంచా తయారీలో పేలుడుపదార్థాలను అధికంగా ఉపయోగించడంతో  ప్రమాదం సంభవించి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు.  గతంలో జి.సిగడాం మండలం పెనసాంలో ఇటువంటి దుర్ఘటన జరిగిన సందర్భంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకున్నట్టు ఎస్పీ చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సరిహద్దులో ఉన్న కొత్త మరువాడ గ్రామంలోని బాణసంచా అక్రమ తయారీదారులపై 2012లో వంగర పోలీసులు కేసులు నమోదు చేయగా, బలిజి పేట పోలీసులు రూ. 1.20 లక్షలు విలువ చేసే బాణసంచాను అప్పట్లో స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.
 
 ముడిపదార్థాలు, పేలుడు పదార్థాలు బొబ్బిలి, విజయనగరం ప్రాంతాల నుం చి సరఫరా జరుగుతోందన్నారు. రెండు జిల్లాల కలెక్టర్ల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి బాణసంచా అక్రమ తయారీ కేంద్రాలు, వాటికి ముడిసరుకును సరఫరా చేసే ఏజెంట్లపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్యాస్‌సిలిండర్ లీకైనందున, విద్యుత్‌షార్ట్‌సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించిందని కొంత మంది స్థానికులు ఎస్పీ వద్ద ప్రస్తావించగా అందులో వాస్తవం లేదని కొట్టిపారేశారు. పాలకొండ ఆర్డీవో సాల్మాన్‌రాజ్, డీఎస్పీ ఆదినారాయణతోపాటు ఐదుగురు ఎస్సైలు, ఇరవై మంది పోలీసులు, రాజాం అగ్నిమాపక కేంద్రం సిబ్బంది, వైద్యసిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కాగా రాజాం ఆస్పత్రిలో క్షతగాత్రులను రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, జిల్లా కలెక్టర్ లక్ష్మీనరసింహం పరామర్శించారు.
 
 ‘లెసైన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాం’
 బాణసంచా తయారీ కోసం లెసెన్స్ ఇవ్వాలని గతంలో జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గేదెల పోలీస్ భార్య లక్ష్మి ఎస్పీ ఖాన్‌తో మాట్లాడుతూ చెప్పారు. ఎరుకుల కులస్తులమైన తమకు బాణసంచా తయారీయే జీవనాధారమని, మరో దిక్కులేదని వాపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement