బరేలీ: యూపీలోని బరేలీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అక్రమంగా నిర్వహిస్తున్న బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి, ముగ్గురు మహిళలు మృతి చెందారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. మరో ఇద్దరు చిన్నారుల జాడ తెలియడం లేదు. వారిని వెదికేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
రెండు గంటల వ్యవధిలో బాణసంచా ఫ్యాక్టరీలో ఒకదాని తర్వాత ఒకటిగా భారీ పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల తీవ్రతకు గ్రామమంతా దద్దరిల్లింది. సిరౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కళ్యాణ్‌పూర్ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. పేలుడు ధాటికి సమీపంలోని పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీం సంఘటనాస్థలికి చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న ఐదుగురిని రక్షించారు. ఈ ఘటన నేపధ్యంలో ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లు సహా నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.
పేలుడు ఘటన గురించి తెలుసుకున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బరేలీ రేంజ్) రాకేశ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఫ్యాక్టరీ నిర్వాహకుడిని నాసిర్‌గా గుర్తించామన్నారు. అతనికిగల లైసెన్సు వివరాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం నాసిర్‌కు భారీగా దీపావళి ఆర్డర్లు వచ్చాయని, దీంతో పగలు, రాత్రి టపాసుల తయారీ పని జరుగుతోందని, చాలా మంది కూలీలు పనిచేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. అయితే ఇక్కడ ఎటువంటి భద్రత ఏర్పాట్లు లేవని వారు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: భారత్ అప్రమత్తంగా ఉండాలి: జీటీఆర్‌ఐ
Comments
Please login to add a commentAdd a comment