తూ.గో జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం
Published Thu, Mar 30 2017 9:52 AM | Last Updated on Tue, Sep 5 2017 7:30 AM
తూర్పుగోదావరి: జిల్లాలోని రావులపాలెంలో స్వైన్ ఫ్లూ కలకలం రేగింది. గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలకు ఈ వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. జిల్లాలోనే మొట్టమొదటిగా రావులపాలెం ఈ వ్యాధి వెలుగు చూడటంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. గ్రామానికి చెందిన సత్తి వెంకటరెడ్డి భార్య నళిని ఇటీవల తీవ్ర అనారోగ్యంతో మృతి చెందింది. ఈమెకు తీవ్ర జ్వరం రావడంతో రాజమండ్రి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
నిమోనియా వ్యాధితో ఈమె మృతి చెందినట్టు వైద్యులు స్పష్టం చేశారు. అయితే, ఆమె ఇద్దరు కుమార్తెలు దీప్తి, శ్రీజలు కూడా నాలుగు రోజుల క్రితం జ్వరం బారిన పడటంతో వారిని కూడా రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రికి చేర్పించారు. వీరిలో దీప్తికి సాధారణ జ్వరం కాగా శ్రీజకు మాత్రం స్వైన్ ఫ్లూ సోకినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారించారు.
వీరి సమీప బంధువు కర్రి వీరారెడ్డి నాలుగేళ్ల కుమార్తె హర్షిత కూడా జ్వరం బారిన పడటంతో కాకినాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ఈమెకు కూడా స్వైన్ ఫ్లూ సోకినట్టు నిర్ధారించి చికిత్స అందజేస్తున్నారు. జిల్లాలో మొదటి సారిగా స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో డీఎంఆండ్‌హెచ్‌ఓ కె. చంద్రయ్య హుటాహుటిన రావులపాలెం చేరుకున్నారు.
స్థానిక ఊబలంక పీహెచ్‌సీ వైద్య సిబ్బందితో కలసి బాధితులు ఇళ్ళ వద్ద పరిస్థితిని సమీక్షించారు. గాలి ద్వారా వ్యాపించే ఈ వ్యాధి మరింత మందికి సోకే అవకాశం ఉన్నందున అంతా జాగ్రత్తలు పాటించాలని ఆయా కుటుంబాల వారికి సూచించారు. గ్రామంలో ఏడు వైద్య బృందాలను ఏర్పాటు చేసి సర్వే చేయించారు. ఎవరికైనా ఈ వ్యాధి సోకినట్లు లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
Advertisement
Advertisement