జలదిగ్బంధంలో ఏజెన్సీ గ్రామాలు
- బిక్కుబిక్కుమంటున్న గిరిజనులు
- పోలవరంలో ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
పోలవరం/పోలవరం రూరల్: గోదావరి నదిలో వరద నీరు పోటెత్తి ప్రవహిస్తుండటతో పోలవరం మండలంలోని ఏజెన్సీ ఎగువ గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గిరిజన గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిపై గల కొత్తూరు, కోండ్రుకోట కాజ్‌వేలను, కడెమ్మ వంతెనను వరదనీరు ముంచెత్తింది. దీంతో మండలంలోని 26 గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కాజ్‌వేల వద్ద అధికారులు నాలుగు నాటు పడవలను ఏర్పాటు చేసి రాకపోకలకు సహకరిస్తున్నారు. నిత్యావసర సరుకుల కోసం బయటి ప్రాంతాలకు వచ్చేవారు, జ్వరాల బారిన పడిన గిరిజనులు పడవలపై కాజ్‌వేను దాటి వరద నీటిలో కాలి నడకన పోలవరం చేరుకుంటున్నారు.
గ్రామాల చుట్టూ వరదనీరు చేరుకోవడంతో గిరిజనులు ఇళ్లకే పరిమితమై బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఆకస్మికంగా గోదావరిలో వరద ఉధృతి పెరగడంతో అధికార యంత్రాంగం గిరిజనులను అప్రమత్తం చేసే పరిస్థితి కూడా లేదు. దీంతో నిత్యావసర సరుకుల కోసం ఎక్కువ సంఖ్యలో గిరిజనులు ప్రయాసలకు గురై పోలవరం చేరుకుంటున్నారు. పాత పోలవరంలోని ప్రైవేటు వైద్యశాలలోకి వరదనీరు ప్రవేశించింది. ఏజెన్సీ ప్రాంతంలో పని చేస్తున్న ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లలేకపోయారు.
ముంపునకు ముందుగానే కోండ్రుకోట పీహెచ్‌సీలో అంబులెన్సు సిద్ధంగా ఉంచాల్సి ఉన్నప్పటికీ అధికారులు విఫలమయ్యూరు. ఇప్పుడు అంబులెన్సు ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లే పరిస్థితి లేదు. ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, డ్వామా పీడీ ఎన్.రామచంద్రారెడ్డి, మండల ప్రత్యేక అధికారి కె.శ్రీనివాసరావు సిబ్బందితో ఏజెన్సీ గ్రామాలకు తరలివెళ్లారు. ఇదిలావుండగా ఉదయం నుంచే రాకపోకలు నిలిచిపోయినప్పటికీ రెవెన్యూ అధికారులు ఉదయం 11 గంటల వరకు పడవలను ఏర్పాటు చేయకపోవడంతో వివిధ అవసరాలపై పోలవరం రావాల్సిన గిరిజనులు కాజ్‌వేల వద్ద గంటల తరబడి ఉండిపోవాల్సి వచ్చింది.
తల్లవరం గ్రామానికి చెందిన కుంజం అరవింద్ అనే బాలుడు జ్వరంతో బాధపడుతూ తప్పనిపరిస్థితిలో మరో బాలుడి సాయంతో వరదనీటిలో నడుచుకుంటూ చికిత్స కోసం పోల వరం చేరుకున్నాడు. అదే గ్రామానికి చెందిన కుంజం వెన్నెల అనే చిన్నారికి జ్వరం రావడంతో ఆమె తల్లి ప్రయాసకు గురై వరదనీటిలో నడుకుంటూ చికిత్స కోసం పోలవరం తీసుకువచ్చింది.
ఇదిలావుండగా పోలవరంలోని రెవెన్యూ సత్రం వద్ద అధికారులు ఫ్లడ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఆర్డీవో వి.మురళీమోహన్‌రావు, తహసిల్దార్ వైవీకే అప్పారావు వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనుల స్థితిగతులపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. పోలవరంలోని పల్లపు ప్రాంతాల్లో వరదనీరు ప్రవేశించకుండా ఏటిగట్టుకు అడ్డుకట్టలు వేసేందుకు ఏజీఆర్‌బీ శాఖ అప్పటికప్పుడు ఇసుక బస్తాలను సిద్ధం చేసింది.