
నీటమునిగిన ఇళ్లు, పొలాలు:కంట్రోల్ రూమ్‌ల ఫోన్ నెంబర్లు
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు, వరదలకు ఇళ్లు, పంట పొలాలు నీట మునిగాయి. భారీనష్టం సంభవించింది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పశ్చిమ, తూర్పు జిల్లాల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. భద్రాద్రి, రాజమండ్రిలో ఇళ్లు నీటమునిగాయి. ధవళేశ్వరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి నీటిమట్టం 15.6 అడుగులకు చేరింది. 15,072 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాయంత్రానికి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గోదావరి వరద ప్రభావం పడింది. జిల్లా వ్యాప్తంగా 1000 హెక్టార్లలో పంట భూములు నీట మునిగాయి. 700 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం జరిగింది. ముక్తేశ్వరం కాజ్‌వేపైకి వరదనీరు వచ్చి చేరింది. 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు నాటుపడవలపై తిరుగుతున్నారు. పి.గన్నవరంలోకి రెండు మృతదేహాలు కొట్టుకు వచ్చాయి.
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. కొత్తూరు కాజ్‌వేపై 4 అడుగుల మేర వరదనీరు వచ్చి చేరింది. 26 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. టూరిజం బోట్లను అధికారులు నిలిపివేశారు. కొవ్వూరులో గోష్పాద క్షేత్ర ఆలయాలు నీట మునిగాయి. ఆచంట, ఎలమంచిలి మండలాలకు వరదముప్పు పొంచి ఉంది. పెరవలి మండలంలో అరటితోట నీటలు మునిగాయి.
కనకాయలంక జలదిగ్బంధంలో చిక్కుకుంది. ముంపు గ్రామాలకు ప్రత్యేక అధికారులుగా జిల్లా అధికారులను నియమించారు. వరద బాధితుల కోసం అధికారులు కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. కొవ్వూరు, నరసాపురం, ఏలూరులలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
ఏలూరు కలెక్టరేట్ నంబర్ - 08812-230050
ఏలూరు ఆర్డీవో కంట్రోల్ రూమ్ నంబర్- 08812-232044
కొవ్వూరు ఆర్డీఓ ఆఫీస్ నంబర్- 08813-231488
నరసాపురం ఆర్డీఓ ఆఫీస్ నంబర్-08814-276699
జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆఫీస్ నంబర్ - 08821-223660
ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. రాత్రి నుంచి ఇప్పటి వరకు 2 అడుగులు గోదావరిలో నీరు తగ్గింది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 53.7 అడుగులుగా ఉంది. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ముంపు బాధితులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచన చేశారు. వరదల కారణంగా భద్రాచలం, పినపాక డివిజన్లలో 20 వేల ఎకరాలకు పైగా వరి, పత్తి పంటలు నీట మునిగాయి. వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఖమ్మం జిల్లాలో గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్‌కు వరద ఉధృతి పెరిగింది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 578.30 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో: 1,54,158 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో: 28,430 క్యూసెక్కులుగా ఉంది.
**