శ్రీశైలం, న్యూస్‌లైన్: మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లు పుష్పపల్లకిపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవానికి వివిధ రకాలైన పూలను వినియోగించారు. సుదూర ప్రాంతాల నుంచి తెప్పించిన 650 రకాల పూలతో పాటు 4,500 విడి పుష్పాలను ఈ సేవ కోసం వినియోగించారు. ఇందులో భాగంగా తెల్ల, పసుపు చేమంతి, ఎర్ర, పసుపు బంతిపూలు, కనకాంబరం, నందివర్ధనం, కాగడా, జబ్ర, కార్నేషన్, అర్కిడ్స్, గ్లాడియోలస్, టైగర్‌రోజ్, స్టార్‌రోజ్, ఆస్ట్రిస్ మొదలైన 16 రకాల పుష్పాలు అలంకరణకు ఉపయోగించారు.
పుష్పపల్లకి అంకాలమ్మ గుడి, నందిమండపం, బయలువీరభద్రస్వామి ఆలయం వరకు కొనసాగింది. వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివార్లకు నారికేళ ఫలాదులను సమర్పించి కర్పూర నీరాజనాలను అర్పించారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఈ రమేష్, ఏఈఓ రాజశేఖర్, హార్టికల్చరిస్ట్ ఏడీ ఈశ్వరరెడ్డి, పర్యవేక్షకులు, మల్లికార్జునరెడ్డి, నాగభూషణం, వివిధ విభాగాల అధికార సిబ్బంది, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు.
నేడు పూర్ణాహుతి ..
శ్రీశైలమహాక్షేత్రంలో జరుగుతున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం ఉదయం ప్రాతఃకాలపూజల అనంతరం 9.40 గంటలకు శ్రీ స్వామివార్ల యాగశాలలో రుద్రహోమ పూర్ణాహుతి జరుగుతుంది. ఆ తరువాత కలశోధ్వాసన, వసంతోత్సవం, అవబృధం, త్రిశూల తీర్థోత్సవం జరిపిస్తారు. అదేరోజు రాత్రి 7గంటలకు ధ్వజావరోహణ కార్యక్రమంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.
పుష్ప సోయగం..మల్లన్న వైభవం
Published Fri, Jan 17 2014 3:30 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
Advertisement
Advertisement