ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం పొందేందు కు టెట్, డీఎస్సీల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తీపికబురు.
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం పొందేందు కు టెట్, డీఎస్సీల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తీపికబురు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఈనెల 22 లేదా 29 తేదీల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినా టెట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు విశ్వసనీయ సమాచారం. టెట్ పేపర్-1 పరీక్షకు జిల్లాలో 1173 మంది, పేపర్-2 పరీక్షకు 10,229 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఫిబ్రవరిలో డీఎస్సీ..
టెట్‌లో అర్హత సాధించిన వారికి వచ్చే ఏడా ది ఫిబ్రవరిలో డీఎస్సీ కౌన్సెలింగ్ ద్వారా ఉపాధ్యాయ ఎంపికలు చేపట్టనున్నారు. జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 28, పండిట్లు 42, పీఈటీలు 9, ఎస్‌జీటీలు 268 ఖాళీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. టెట్ రాసిన వారిలో 50 శాతం మంది అర్హత సాధించినా సుమారు 6వేల మంది అభ్యర్థులు డీఎస్సీలో పోటీపడతారు. ఈ సారి ఉపాధ్యాయ ఉద్యోగానికి గట్టి పోటీ తప్పదని భావిస్తున్నారు.