హైదరాబాద్: ఖైరతాబాద్ వినాయకుడికి నైవేద్యంగా ఉంచిన లడ్డూను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేశారు. వర్షంలో తడిసిన లడ్డూ పాడైపోవడంతో దీన్ని హుస్సేన్ సాగర్లో కలిపేశారు. చెడిపోకుండా ఉంటే భక్తులకు పంపిణీ చేయాలని నిర్వాహకులు భావించారు. భక్తుల కూడా మహాగణపతి ప్రసాదం కోసం భారీగా తరలివచ్చారు. లడ్డూ పూర్తిగా పాడైపోయిందని, తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు తేల్చారు. దీంతో భక్తులు నిరాశగా వెనుదిరిగారు.
రాష్ట్రవ్యాప్తంగా పేరొందిన ఖైరతాబాద్ లంబోదరుడి చేతిలో ఏర్పాటు చేసిన 4200 కిలోల లడ్డూ బుధవారం సాయంత్రం ఏకధాటిగా కురిసిన వర్షానికి తడిసింది. దాదాపు మూడు గంటల పాటు వర్షంలో తడవడంతో అది చక్కెర పానకంలా తయారైంది. లడ్డూను దించిన తర్వాత కవర్‌లతో కప్పి ఉంచడం వల్ల గాలి ఆడక కూడా అది చెడిపోయింది. ఒకవేళ లోపలి భాగం పాడవకుండా ఉంటే భక్తులకు పంపిణీ చేయాలని భావించారు. లడ్డూ మొత్తం పాడైపోవడంతో చేసేది లేక సాగర్లో నిమజ్జనం చేశారు. భక్తులకు లడ్డూ పంపిణీ చేయకుండా నిమజ్జనం చేయడం ఖైరతాబాద్ లో ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. లడ్డూ పాడవకుండా ఉంటే లక్షా 60 వేల మందికి పంచేవారు.
కన్నీళ్లు పెట్టుకున్న మల్లిబాబు
లడ్డూ పాడైపోవడంతో దాన్ని తయారుచేయించిన సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే లడ్డూ పాడైపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 16 మంది గణేష్ మాలలు ధరించి వారం రోజుల పాటు కష్టపడి అత్యంత పవిత్రంగా లడ్డూను తయారు చేశారని చెప్పారు. తానెంతో వ్యయప్రయాసలకోర్చి తయారు చేయించిన లడ్డూ భక్తులకు దక్కకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.