విదేశీ నాణేల గుట్టలు
⇒ టీటీడీ ఖజానాలో పేరుకుపోతున్న వైనం
⇒ ఇప్పటికే 200 టన్నులు ఉంటాయని అంచనా
⇒ పరిపాలన భవనం, గోవిందరాజస్వామి ఆలయంలో నిల్వ
సాక్షి,తిరుమల: తిరుమలేశునికి విదేశీ భక్తులు భక్తితో సమర్పించే నాణేలు నిష్ఫలంగా మారుతున్నాయి. దశాబ్దంగా గుట్టలుగా పోస్తున్న టీటీడీ అధికారులు వాటి మార్పిడి గురించి పట్టించుకోవడంలేదు. ఫలితంగా నాణేలు రూపు మారుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200 టన్నుల నాణేల పరిస్థితి ఇలా తయారైంది. వాటిని మార్పిడి చేస్తే స్వామి వారి ఖజానాకు భారీ ఆదాయం సమకూరుతుందన్న వాస్తవాన్ని అధికారులు గుర్తించడంలేదు. వడ్డీకాసులవాడైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి హుండీలో భక్తులు సమర్పించే కానుకలు ప్రతి నెలా కోట్లలో ఉంటాయి.
ఇందులో విదేశీ కరెన్సీ వాటా 15 శాతం పై మాటే. నాణేలు మరో 5 శాతం ఉంటాయని అంచనా. తిరుమలేశునికి విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు తమ వెంట తీసుకొచ్చిన కరెన్సీ నోట్లతోపాటు నాణేలు కూడా కానుకగా సమర్పించి మొక్కు చెల్లించుకుంటారు. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాతోపాటు ఆసియా ప్రాంతానికి చెందిన సింగపూర్, మలేషియా, మార్షియస్, ఇండోనేషియా, బ్యాంకాంగ్, శ్రీలంక, కువైట్, దుబాయ్ వంటి ఎన్నో దేశాలకు చెందిన నాణేలు శ్రీవారి హుండీలో ఎక్కువగా వస్తుంటాయి. శ్రీవారికి 2016–2017 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.1110 కోట్ల హుండీ కానుకలు లభించాయి. ఇందులో విదేశీ కరెన్సీ సుమారు రూ.150 కోట్లుపైబడి ఉంది. ఇక విదేశీ నాణేల విలువ కూడా సుమారు రూ.60 కోట్ల వరకు ఉంది.
వాటిని నిర్ణీత గడువులో విదేశీ మారకద్రవ్యంతో నగదు మార్పిడి చేసుకుంటే శ్రీవారి ఖజానాకు మరింత ఆదాయం లభిస్తుంది. అయితే టీటీడీ అధికారులు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడంలేదు. దశాబ్దంగా విదేశీ నాణేలు గుట్టలుగా ఉండడమే ఇందుకు నిదర్శనం. మొదట పరిపాలన భవనంలో నిలువ చేయడం మొదలు పెట్టిన అధికారులు అక్కడ నిండిపోవడంతో ఇప్పుడు గోవిందరాజస్వామి ఆలయంలోని ఆభరణాలు భద్రపరిచే గదిలోకి చేరుస్తున్నారు. ఇక్కడ 100 టన్నులు, అక్కడ మరో 100 టన్నులు ఉంటాయని భావిస్తున్నారు.
పొడిగా రాలిపోతున్న నాణేలు
వివిధ దేశాలు వివిధ లోహాలతో నాణేలు తయారు చేస్తుంటాయి. ఏ నాణెలు అయినా వాడకుండా గుట్టలుగుట్టలుగా పడేస్తే లోహ మిశ్రమాలతో కూడినవి కావడంతో రసాయన చర్య జరిగి రూపు కోల్పోవడంతో పాటు పొడిగా మారతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం టీటీడీ వద్ద దశాద్ద కాలం దాటిన నాణేలు కూడా ఉన్నాయంటే వాటి పరిస్థితి ఏమిటో అర్థం అవుతుంది. తక్షణమే వీటిని తరలించికపోతే నాణెం విలువ మాట ఎటున్నా లోహం విలువ కూడా రాదని నిపుణులు చెబుతున్నారు. దీనిపై సంబంధిత టీటీడీ విభాగాధిపతులు చొరవ తీసుకోవాల్సి ఉంది.