సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో మంచి పరిపాలన జరుగుతుంటే ‘జే ట్యాక్స్’ పేరుతో టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ చైర్మన్ రెహమాన్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. జే ట్యాక్స్ అని టీడీపీ నేతలు మరోసారి విమర్శిస్తే.. గత ప్రభుత్వంలో టీడీపీ నేతలు ఎంతెంత ముడుపులు తీసుకున్నారో లెక్కలతో సహ బయటపెడతానని హెచ్చరించారు. ‘చంద్రబాబు హయాంలో కొన్ని బ్రేవరేజెస్‌కి మాత్రమే అనుమతులిచ్చింది నిజం కాదా.. రూ. 600 కోట్లు ముడుపులు తీసుకున్నారని ఆ రోజు అసెంబ్లీలో మైసురారెడ్డి ఆరోపణలు వాస్తవం కాదా.. ’ అని రెహమాన్ ప్రశ్నించారు.
కొందరు ప్రజల్లోకి రాలేకపోతున్నారు..
ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీలతో మైనార్టీలు అభద్రత భావానికి గురవుతున్నారని ఎన్‌ఆర్‌సీ అమలు కాకుండా కేంద్రంతో మాట్లాడతానని.. అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం కూడా చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం అభినందనీయమన్నారు. కొందరు నేతలు ట్విట్టర్‌కి మాత్రమే అలవాటు పడ్డారని.. ప్రజల్లోకి రాలేకపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మద్యపాన నిషేధం అమలు చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అయితే.. తూట్లు పొడిచిన నేత చంద్రబాబు అని అభివర్ణించారు.
దశలవారీ మద్యపాన నిషేధంపై తీసుకుంటున్న చర్యలతో ప్రజల జీవన విధానాలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. ఈ విధానంతో సంతోషంగా ఉన్నామని ప్రజలంతా చెబుతుంటే టీడీపీకి అర్థం కావటం లేదా అని దుయ్యబట్టారు ‘రాష్ట్రంలో మంచి పనులు చేస్తున్న ప్రభుత్వానికి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు సహకరించాలి. అవసరమైతే సూచనలు కూడా చేయాలి. తప్పుడు విమర్శలతో అభివృద్ధికి అడ్డుపడొద్దని’ రెహమాన్ హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment