యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి)/సాక్షి, అమరావతి: విద్యావేత్త, తిరుపతికి చెందిన తొలితరం నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ డాక్టర్ అగరాల ఈశ్వర రెడ్డి(87) ఆదివారం మృతి చెందారు. వారం రోజులుగా అనారోగ్యంతో స్విమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈయన స్వగ్రామం చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలోని తూకివాకం. ఈయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు తిరుపతిలో, కుమార్తె చెన్నైలో వైద్యురాలిగా స్థిరపడ్డారు. డాక్టర్ ఈశ్వరరెడ్డి తిరుపతి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తిరుపతి, రేణిగుంటలో విద్యా సంస్థలు స్థాపించి, విద్యాదానం చేస్తున్నారు. ఆచార్య ఎన్జీరంగా, మాడభూషి అనంతశయనం అయ్యంగార్‌లకు శిష్యుడిగా గుర్తింపు పొందారు. 1982 సెప్టెంబర్ 7 నుంచి 1983 జనవరి 16వరకు స్పీకర్‌గా పనిచేశారు. అంతకు ముందు 1981 మార్చి 23 నుంచి 1982 సెప్టెంబర్ 6 వరకు డిప్యూటీ స్పీకర్‌గానూ పనిచేశారు.
స్వతంత్ర పార్టీ నుంచి ఎన్నిక
1967లో డాక్టర్ అగరాల ఈశ్వరరెడ్డి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1978లో ఇందిరా కాంగ్రెస్‌లో చేరి గురవారెడ్డిపై గెలుపొందారు. అప్పటి సీఎం అంజయ్య ఈయనను డిప్యూటీ స్పీకర్‌గా నియమించారు. అనంతరం ఇందిరా ఆశీస్సులతో స్పీకర్‌గా నియమితులయ్యారు.
విద్యావేత్త : డాక్టర్ అగరాల ఈశ్వరరెడ్డి మద్రాస్ రెసిడెన్సీ కళాశాల నుంచి డిగ్రీ, ప్రెసిడెన్సీ కళాశాల నుంచి ఎంఏ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశారు. మద్రాస్ లా కళాశాల నుంచి బీఎల్ డిగ్రీ పొందారు. రాంచీ యూనివర్సిటీలో పరిశోధనలు చేసి, రాజనీతి శాస్త్రంలో డాక్టరేట్ పొందారు. విద్యాసంస్థలు నెలకొల్పడమే కాకుండా అనేక పుస్తకాలు రచించారు. ఎస్వీయూ, ఏపీ వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు సిండికేట్ సభ్యుడిగా పనిచేశారు. ఉస్మానియా వర్సిటీకి సెనెట్ మెంబర్‌గానూ పనిచేశారు. కాగా ఈశ్వరరెడ్డి భౌతిక కాయానికి సోమవారం సాయంత్రం తిరుపతిలోని గోవిందధామంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
సీఎం వైఎస్ జగన్ సంతాపం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ అగరాల ఈశ్వరరెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయవేత్త అయిన ఈశ్వరరెడ్డి తన అభిప్రాయాలను నిర్భయంగా, నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తారనే పేరును గడించారని జగన్ కొనియాడారు. ఈశ్వరరెడ్డి కుటుంబీకులకు ముఖ్యమంత్రి జగన్ తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.
మాజీ స్పీకర్ అగరాల ఈశ్వరరెడ్డి మృతి
Published Mon, Feb 17 2020 3:44 AM | Last Updated on Mon, Feb 17 2020 3:44 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment