అదును తప్పింది
కడప అగ్రికల్చర్ : వర్షాభావ పరిస్థితులు రైతన్నను అఘాతంలో పడేశాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలన్నర దాటినా ఆశించిన పదును వర్షం కురవకపోవడంతో పంటల సాగు అగమ్యగోచరంగా తయారైంది. గత ఏడాది ఇదే సమయానికి ఆశించిన మేర పంటలు సాగు కావడంతో, ఈ ఏడాది రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు.
పంటల సాగుకు పొలాలను దుక్కులు దున్ని, ఎరువులు, విత్తనాలు సిద్ధం చేసుకున్నారు. అడపాదడపా చిరుజల్లులు, ఓ మోస్తరు వర్షం కరుస్తుండడంతో రైతుల్లో కాస్త కొత్త ఉత్సాహం కనిపించింది. అరకొర పదునైనా, రాబోయే రోజుల్లో మంచి వర్షాలు పడతాయనే నమ్మకం కుదరకపోవడంతో రైతులు పంటసాగుకు పూనుకోలేక పోతున్నారు. కొంతమంది రైతులు వర్షాలు కురవకపోతాయా? పంటలు పండించుకోక పోతామా...అనే నమ్మకాన్ని మనసులో ఉంచుకుని ఆకాశంవైపు ఆశగా చూస్తున్నారు.
విత్తన పంపిణీ ఇలా......
వేరుశనగ కాయలు 4986 క్వింటాళ్లకుగాను 2930 క్వింటాళ్లు పంపిణీ చేశారు. అలాగే వరి విత్తనాలు 4130.01 క్వింటాళ్లకుగాను, 2542.25 క్వింటాళ్లు, కందులు 676.44 క్వింటాళ్లకుగాను, 263.04 క్వింటాళ్లు, పెసలు 80 క్వింటాళ్లకుగాను, 30.58 క్వింటాళ్లు, మినుములు 173.2 క్వింటాళ్లకు 69.2 క్వింటాళ్లు, జీలుగలు 5474.6 క్వింటాళ్లకు 5373.8 క్వింటాళ్లు, జనుములు 1324 క్వింటాళ్లకు 1198.8 క్వింటాళ్లు పంపిణీ చేశారు.
సాగని...సాగు.. కదలని కాడి....
జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో సాధారణ సాగు 2.11 లక్షలుకాగా, ఇందులో 1,76,849 హెక్టార్లలో ప్రధాన పంటలు సాగు చేస్తారని వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జూన్ నెలలో 69.2 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 46.7 మి.మీ కురిసింది. జూలై నెలలో 97.0 మి.మీ కురవాల్సి ఉన్నా ఇప్పటి వరకు 33.5 మి.మీ కురిసింది. ఈ అరకొర వర్షానికి జిల్లా వ్యాప్తంగా వేరుశనగ, కంది, ఆముదం, సజ్జ, పత్తి,పెసర, వరి, అలసంద, మిరప, ఉల్లి తదితర పంటలు కలిపి 6,997 హెక్టార్లలో సాగైనట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.
విత్తనాలను తెగనమ్ముకుంటూ...
ఈ ఏడాది ఖరీఫ్‌లో పదునుపాటి వర్షాలు కురుస్తాయని రైతులు ప్రధాన పంటైన వేరుశనగ సాగుకు విత్తనకాయలను అనంతపురం, హిందూపురం, కర్నూలు ఆళ్లగడ్డ, నంద్యాల, శ్రీకాళహస్తి, కదిరి ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకున్నారు. వేరుశనగ విత్తనకాయలు 41 కిలోల బస్తాను రూ. 2200లు వెచ్చించి తీసుకొచ్చారు. జూన్ నెల మొదటి వారంలో వర్షాలు కురుస్తాయని ఆశించారు. నెలన్నర కావస్తున్నా అదునులో సంపూర్తి పదును కాకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో, బర్మా(ఊజిఈగ)పురుగు ఆశిస్తే కొనుగోలు చేసే వారుండనే భయంతో విత్తనాలను తెగనమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదనతో తెలిపారు.
ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలంటున్న అధికారులు :
ఈ సీజన్‌లో అదునులో పదును కాకపోవడంతో ప్రధాన పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాల్సిందేనని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. రైతులు వేరుశనగకు బదులుగా కొర్ర, కంది, సజ్జ, మొక్కజొన్న, జొన్న, ఆముదం, పొద్దుతిరుగుడు పంటలవైపు దృష్టి సారించాలని సూచిస్తున్నారు.