
ప్రాణాలు తీసిన పొగమంచు
పొగమంచు నలుగురి ప్రాణాలను బలిగొంది.మండలంలోని గొడిచర్ల జంక్షన్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి విపరీతమైన పొగమంచు కమ్ముకుంది.
నక్కపల్లి: పొగమంచు నలుగురి ప్రాణాలను బలిగొంది.మండలంలోని గొడిచర్ల జంక్షన్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి విపరీతమైన పొగమంచు కమ్ముకుంది. ఎదురుగా వస్తున్న, ముందు వెళుతున్న వాహనాలు కనపడని పరిస్థితి. దీంతో శనివారం తెల్లవారుజామున జాతీయరహదారిపై రోడ్డుప్రమాదం చోటుచేసుకుని విజయవాడకు చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
విజయవాడ పరిసర ప్రాంతాలకు చెంది ఆరుగురు సిండికేట్‌గా ఏర్పడి రియల్‌ఎస్టేట్‌వ్యాపారం చేస్తున్నారు. విజయవాడలో విక్రయించిన భూమికి సంబంధిం చి అడ్వాన్సు తీసుకునేందుకు ఇన్నోవా వాహనంలో విశాఖ వస్తుండగా శనివారం తెల్లవారుజామున 3గంటలకు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఎస్‌ఐ విజయ్‌కుమార్, హైవేపోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందిన గరిమెళ్ల గోవర్ధనరావు( 40డ్రైవింగ్‌చేస్తున్న వ్యక్తి), కొండపల్లి శివరామకృష్ణశాస్త్రి(44), వంగాప్రకాశరావు(55), నల్లమోతు రవి సుధాకర్(47)లు దుర్మరణం పాలయ్యారు.
వీరితో పాటు ప్రయాణిస్తున్న పరశురాం, ఎండిఫరూఖ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను స్థానిక పోలీసులు, హైవేపెట్రోలింగ్ సిబ్బంది అతికష్టం మీద బయటకు తీశారు. ఆరుగురూ రియల్‌ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వాములు. ఇటీవల విజయవాడలో స్థలం విక్రయించినట్లు సమాచారం. దానికి సంబంధించి అడ్వాన్సు తీసుకునేందుకు విశాఖ బయలు దేరి నట్టు తెలిసింది. మృతుల్లో ఒకరైన సుధాకర్ ఏపీ న్యూస్ పేరుతో ఒక న్యూస్‌చానల్ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది.
దీని ఏర్పాట్లను కూడా చర్చించేందుకు, అవరసమై స్థలాన్ని, వసతిని పరిశీలించేందుకు విశాఖ బయలుదేరినట్లు సన్నిహితుల ద్వారా తెలిసింది. ఇందుకు సంబంధించిన గుర్తింపుకార్డు ఒక మృతుని వద్ద లభించింది. వారివద్ద ఉన్న ఆధారాల మేరకు కుటంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ప్రకాశరావు కుటుంబసభ్యులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. మృతదేహాలను పోస్టుమార్టానికి నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఎలమంచిలి సీఐ మల్లేశ్వరరావు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు.
లారీ కోసం గాలింపు
ప్రమాదం జరిగిన వెంటనే లారీ పరారయింది. ఇన్నోవాలో ఉన్నవారు మరణించిన విష యం గుర్తించిన డ్రైవర్ లారీని తీసుకుని వెళ్లిపోయినట్లు సమాచారం.లారీ ఆగిఉన్న సమయంలో వాహనం ఢీకొట్టిందా, లేక ప్రయాణిస్తూ సడన్‌బ్రేక్‌వేయడం వల్ల ఢీకొట్టిందా అన్నది నిర్ధారించుకోవడానికి పోలీసులు లారీ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. వేంపాడు టోల్‌గేట్‌లో సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించి లారీ ఆచూకి కనుగొనేప్రయత్నం ప్రారంభించారు.