నాగమణి కలకలం!
ఎమ్మిగనూరు టు మలేషియా వయా కర్ణాటక
ఎమ్మిగనూరు: నాగ‘మణి’ కర్ణాటక రాష్ట్రంలోని ఓ లాకర్‌లో ఉంది. కోట్లాది రూపాయల విలువ చేస్తుంది. మలేషియాకు చెందిన ఓ వ్యక్తి మాత్రమే ఆ లాకర్‌ను తెరవగలడు. అతనికి రూ.8 కోట్లు ముట్టుజెబితే మణి సొంతమవుతుంది. అప్పుడు కోట్లకు పడగలెత్తొచ్చు. మణిని కొనుగోలు చేసేందుకు ఇప్పటికే చాలా మంది ఒప్పందం చేసుకున్నారు. ఈ ప్రచారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని పలువురు వ్యాపారులను నిలువునా ముంచింది.
అత్యాశకు పోయిన వీరంతా ఇళ్లను అమ్ముకొని.. వ్యాపారాలను తాకట్టుపెట్టి ఉందో లేదో తెలియని మణి కోసం ఉన్నదంతా ఊడ్చిపెట్టేశారు. నియోజకవర్గ కేంద్రమైన ఎమ్మిగనూరు సమీపంలోని అగ్రహారం గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్, సోమేశ్వర సర్కిల్‌లో మిఠాయి వ్యాపారం చేస్తున్న మరో వ్యక్తి నాగ‘మణి’ పేరిట కోట్లాది రూపాయలు వసూలు చేశారు. ఇటీవల గాంధీనగర్‌లో ఇల్లు కట్టుకున్న ఓ డాక్యుమెంట్ రైటర్ అతని మాయలో పడి దాన్ని రూ.45లక్షలకు విక్రయించి వారి చేతిలో పెట్టేశాడు.
సోమప్ప సర్కిల్‌లో బట్టల వ్యాపారం చేస్తున్న ఓ శెట్టి ఏకంగా ఆరు నెలల్లోనే రూ.2 కోట్లకు పైగా అప్పు చేసి వారికి ముట్టజెప్పాడు. మరో బట్టల వ్యాపారి రూ.1.5 కోట్లు.. సెల్ షాపు నిర్వాహకుడు రూ.30 లక్షలు.. ఫర్నిచర్ దుకాణం యజమాని.. అందరూ కలసి మొత్తం రూ.8 కోట్లకు పైగా నగదు మణి మాయలో పడి చేజార్చుకున్నారు. ప్రస్తుతం వీరంతా తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు.
వీరి నుంచి వసూలు చేసిన రూ.8 కోట్లు మలేషియాకు చెందిన వ్యక్తికి అప్పగించామని.. అతను వచ్చి కర్ణాటకలోని లాకర్ తెరిస్తే నాగ‘మణి’ని సొంతం చేసుకోవచ్చని ఇప్పటికీ ఆ ఇరువురు వ్యాపారులు నమ్మబలుకుతున్నారు. వీరు ఈ ఏడాది మార్చిలో రెండు పర్యాయాలు మలేషియా వెళ్లొచ్చినట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. మరి లేని మణి వీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారో.. వసూలు చేసిన కోట్లాది రూపాయలను ఏమి చేశారో.. తిరిగి డబ్బు ఎలా చెల్లిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.
ఇప్పటికే ఆరు నెలలు గడిచిపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. సొంతింటిని పోగొట్టుకున్న డాక్యుమెంట్ రైటర్ సోదరులు ఇద్దరు పోలీసు శాఖలో పని చేస్తున్నారు. వీరు తమ అన్నకు జరిగిన మోసాన్ని తెలుసుకొని అగ్రహారం ఏజెంట్‌ను ఇటీవల దబాయించగా జూలై 15లోగా రూ.50లక్షలు తిరిగిచ్చేస్తామని.. అప్పటి వరకు ఎస్పీ దృష్టికి తీసుకుపోవద్దని వేడుకున్నట్లు సమాచారం.