
ఆన్‌లై న్ డేటా వర్క్ పేరుతో మోసం
కనిగిరి : ఆన్‌లైన్ డేటా వర్క్ పేరుతో నిరుద్యోగులను మోసం చేసి లక్షల రూపాయలు దిగమింగిన ఉదంతం శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. స్థానిక కొత్తపేటలో ఉదయకుమార్ అలియాస్ ప్రదీప్ అనే యువకుడు ఆన్‌లైన్‌లో డేటా వర్క్ ఇస్తానని ఏడాది నుంచి నిరుద్యోగులను నమ్మిస్తున్నాడు. డేటా వర్క్ కావాలంటే తొలుత తన ప్రాజెక్ట్‌లో సభ్యునిగా చేరాలని చెప్తాడు. అందుకు ముందుగా రూ. 25 వేలు చెల్లించాలని మెలిక పెడతాడు. ఈ విధంగా అనేక మంది నుంచి డబ్బులు వసూలు చేసుకుని తన సొంత ఖాతాకు జమ చేసుకున్నాడు.
నమ్మించేది ఇలా..
ప్రదీప్ ముందు నిరుద్యోగులను గుర్తిస్తాడు. అతని వద్ద సభ్యునిగా చేరాక వెబ్‌సైట్ ద్వారా మీకు సాఫ్ట్‌వేర్ ఇస్తానని చెప్తాడు. డేటా ఎంట్రీ వర్క్ చేసేందుకు అవసరమైన ల్యాప్‌టాప్ కూడా తన వద్దే కొనాలని షరతు విధిస్తాడు. ల్యాప్‌టాప్ బయట కొంటే సాఫ్ట్‌వేర్ సక్రమంగా సపోర్ట్ చేయదని నమ్మిస్తాడు.
తక్కువ కష్టంతో సులువుగా డబ్బులు సంపాదించే మార్గమని, మీరు చేయాల్సిందల్లా కేవలం కొలేటి బబుల్ వెబ్‌సైట్‌లో 3 వేల క్యాప్‌చా (గజిబిజిగా ఉన్న ఇంగ్లిష్ పదాలను అక్షరాలుగా గుర్తించడం) టైప్ చేస్తే ఒక డాలర్ మీ అకౌంట్‌లో జమ అవుతుందని చెబుతాడు. ఒక డాలర్ (58 రూపాయలు) అకౌంట్‌లో పడాలంటే అర గంట టైప్ చేస్తే సరిపోతుందని, రోజుకు 3 గంటలు పనిచేసినా మీకు రూ.300 నుంచి రూ.400 వరకు ఆదాయం వస్తుందని ఆశ చూపుతాడు.
రంగంలోకి ఏజెంట్లు
ఇక అక్కడి నుంచి ఒకరిద్దరు ఏజెంట్లను రంగంలోకి దింపుతాడు. తమకు చాలా ఆదాయం వస్తోందని నిరుద్యోగుల వద్ద వారితో ప్రచారం చేయిస్తాడు. ముగ్గురిని నెట్‌వర్క్‌లో చేర్పిస్తే ఏజెంట్‌కు కరెంట్‌బిల్, నెట్ బిల్, రూమ్‌రెంట్ బోనస్‌గా ఇస్తానని నమ్మబలుకుతాడు. అనేక మంది విద్యార్థులు, యువకులు ప్రదీప్ మాయలో పడి నిలువునా మోసపోయారు.
అనుమానం వస్తే ఇలా.. నమ్మిస్తాడు
ఆన్‌లైన్ డేటా వర్క్‌లో చేరిన వారికి సాఫ్ట్‌వేరు యూసర్ ఐడీ నంబర్ ఇస్తాడు. ఆ తర్వాత రెండు రోజులకు ఆ యూసర్ ఐడీని ఉదయ్‌కుమారే బ్లాక్ చేస్తాడు. దీనిపై అనుమానం వచ్చిన యువకులు ఆయన్ను ప్రశ్నిస్తే మీరు డేటా ఎంట్రీలో తప్పులు కొట్టారని, అందువల్లే మీ యూసర్ ఐడీ రద్దయిందని నమ్మిస్తాడు. తిరిగి యూసర్ ఐడీ ఇన్‌స్టాల్ చేయాలంటే మరో రూ. 5 వేలు కట్టాలని చెబుతాడు. అంతేగాకుండా నమ్మకం కుదిరేందుకు డాలర్ రూపంలో (నగదును) డేటా వర్క్ చేసిన వారి అకౌంట్లో కంపెనీ వారు వేసినట్లు తనే జమ చేస్తాడు. దీంతో వారికి నమ్మకం కలిగి మరి కొందరిని చేర్పించారు.
కంప్యూటర్ పరిజ్ఞానం లేనివారు కూడా సభ్యులే
నెట్‌వర్క్‌లో కనీస కంప్యూటర్ పరిజ్ఙానం లేనివారు కూడా సభ్యులుగా చేరారు. వారు ఇంగ్లిష్‌లో 3000 పదాలు కొట్టలేక నగదు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు ఉదయ్‌కుమార్ నిరాకరించాడు. బాధిత యువకులు ఆయన ఇంటికి వెళ్లి నిలదీయగా మీపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని బెదిరించాడని బాధితులు వంశీ, జోసఫ్, రంగప్రసాద్, వెంకట రామిరెడ్డి, అశోక్, మేరీ, శిరీషలు విలేకరుల ఎదుట వాపోయారు.
తీగలాగితే డొంక కదిలింది
తీగ లాగితే డొంక కదిలినట్లు తొలుత చిన్న కేసుగా భావించి పెద్దగా పట్టించుకోని పోలీసు అధికారులు ఆ తర్వాత బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడు ప్రదీప్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అనేక విషయాలు వెలుగు చూశాయి. అతనిపై చీరాల, దర్శి ప్ రాంతాల్లో పలు చీటింగ్ కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించారు.
2009లో షిరిడీ సాయి వికలాంగుల ఆశ్రమం పేరిట గొలుసు సిస్టంతో రూ. లక్షలు ప్రజల నుంచి వసూలు చేసి పరారయ్యాడని తెలుసుకున్నారు. ఆ కేసులో ఐదేళ్ల నుంచి అరెస్టు కాకుండా పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడని సీఐ యూ.సుధాకర్‌రావు విలేకర్లకు వెల్లడించారు. నిందితుడు ఉదయ్‌కుమార్ అలియాస్ ప్రదీప్ ఓ విశ్రాంత హెడ్ కానిస్టేబుల్ కుమారుడు కావడం కొసమెరుపు.