
మద్యం మత్తులో తండ్రి ఘాతుకం
చిత్తూరు మండలం దిగువ మాసాపల్లిలో ఘటన
చిత్తూరు రూరల్: ఏడాదిన్నర పసికందును తండ్రే నేలకేసి కొట్టి చంపిన ఉదంతం చిత్తూరు మండలం దిగువ మాసాపల్లిలో శనివారం వెలుగుచూసింది. బీఎన్‌ఆర్ పేట ఎస్‌ఐ వెంకట సుబ్బమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. తవణంపల్లి మండలం మాధవరం సమీపంలోని కృష్ణాపురం గ్రామానికి చెందిన ఓ మహిళకు ఐరాల మండలం జంగాలపల్లికి చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది.
మూడేళ్ల క్రితం భర్త వదిలేయడంతో ఆమె చిత్తూరు జిల్లా దిగువ మాసాపల్లికి వచ్చి ప్రదీప్ (34) అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ నేపథ్యంలో వారికి ఏడాదిన్నర క్రితం కుమారుడు పుట్టాడు. కాగా.. ఆ మహిళ ఇటీవల దిగువ మాసాపల్లిలోనే ఓ కోళ్లఫారంలో పనికి కుదిరింది.
కాగా.. ప్రదీప్ శుక్రవారం మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో పసికందు ఏడుస్తుండటంతో బిడ్డను నేలకేసి కొట్టి చంపేశాడు. ఆ తరువాత తేరుకుని ఇంటిపై నుంచి పడి బిడ్డ మృతి చెందాడని చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. బంధువులకు అనుమానం రావడంతో మహిళ సోదరుడు బీఎన్‌ఆర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి.. పసికందు మరణానికి కారణమైన తండ్రి ప్రదీప్‌ను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment