విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : స్థానిక ఎన్నికలు శుక్రవారంతో ముగియనున్నాయి. శనివారం నుంచి సార్వత్రిక ఎన్నికల హడావుడి ప్రారంభం కానుంది. ఈ నెల 12న సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. ఆ రోజు నుంచే నామినేషన్లు స్వీకరిస్తారు. 19వ తేదీ వరకు నామినేషన్లను సమర్పించవచ్చు. 13వ తేదీ ఆదివారం, 14 అంబేద్కర్ జయంతి, 18 గుడ్‌ఫ్రైడే సెలవు దినాలు కావడంతో కేవలం మిగిలిన అయిదు రోజులు మాత్రమే స్వీకరిస్తారు.
నామినేషన్ ఫారాలు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి. వాటిని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు పంపిణీ చేశారు. జిల్లాలో ఉన్న 15 అసెంబ్లీ, 3 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కో సెగ్మెంట్‌కు ఒక్కో రిటర్నింగ్ అధికారిని నియమించారు. ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా రిటర్నింగ్ అధికారులకే నామినేషన్లు సమర్పించాలి. ఈ విషయంలో అభ్యర్థులు జాగ్రత్తలు వహించకపోతే తిరస్కరణకు గురై ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోవాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ తెలిపారు.
నామినేషన పత్రాలు ఆయా ఆర్‌వో కార్యాలయాల్లో తీసుకుని, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దాఖలు చేయవచ్చు ఒక్కో అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్లు వరకు నామినేషన్లు వేసే అవకాశముంది. సక్రమంగా ఉన్న ఒక సెట్ నామినేషన్ వేసినా సరిపోతుంది.
గుర్తింపు పొందిన పార్టీలు(ఉదా:బీజేపీ, కాంగ్రెస్,టీడీపీ,టీఆర్‌ఎస్) అభ్యర్థికి ఒక ప్రపోజర్ ఉంటే సరిపోతుంది. అభ్యర్థికి ఎక్కడైనా ఓటు హక్కు కలిగి ఉండవచ్చు. ఒక చోట ఓటు ఉండి, మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసే వారు ఓటు హక్కు కలిగిన ప్రాంతంలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ఈఆర్‌ఓ) నుంచి ధృవీకరణ పత్రం తీసుకొని నామినేషన్‌తో పాటు సమర్పించాలి.
అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించే ప్రపోజర్‌కు మాత్రం ఆ అభ్యర్థి పోటీ చేసే నియోజకవర్గంలో ఓటరై ఉండాలి.
గుర్తింపు లేని రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులకు(ఉదా. వైఎస్‌ఆర్‌సీపీ, జై సమైక్యాంధ్ర పార్టీలు) మాత్రం 10 మంది ప్రపోజర్లు సంతకం చేయాల్సి ఉంటుంది. స్వతంత్ర అభ్యర్థులకు కూడా ఇంతే సంఖ్యలో ప్రపోజర్లు ఉండాలి.
అయితే రిటర్నింగ్ అధికారుల కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో అభ్యర్థుల అనుచరులను, వాహనాలను నిలిపివేస్తారు. మూడు వాహనాలను, అభ్యర్థితో పాటు మరో నలుగురు ప్రపోజర్లను కార్యాలయంలోకి అనుమతిస్తారు.
ముందుగానే అభ్యర్థులు తమ 10 మంది ప్రపోజర్లతో నామినేషన్ పత్రాలను సంతకాలు చేయించాలి.
ఒకవేళ ఎవరైనా ప్రపోజర్స్ సంతకం చేయకుండా వేలిముద్ర వేయాల్సి వస్తే అటువంటి వారు రిటర్నింగ్ అధికారి సమక్షంలోనే ముద్ర వేయాలి.
లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థి రూ.25 వేలు, శాసనసభకు పోటీ చేసే అభ్యర్థి రూ.10 వేలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50 శాతం చెల్లిస్తే సరిపోతుంది. వారు కులధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి.
నామినేషన్ పత్రంతో పాటు ప్రధానమైన ఫారం-26 అఫిడవిట్‌ను అభ్యర్థులు సమర్పించాలి.
ఇందులో ప్రతీ కాలమ్‌ను అభ్యర్థులు నింపాల్సి ఉంటుంది.
అఫిడవిట్‌లో వ్యక్తిగత వివరాలు
ఈ అఫిడవిట్‌ను రూ.10 స్టాంప్‌తో నోటరీ చేయించాలి.
ఇందులో అభ్యర్థుల వ్యక్తిగత వివరాలు, కుటుంబ, ఆస్తులు, కేసులు, ప్రభుత్వ సంస్థలకు బకాయిలు, ఇలా అన్ని వివరాలు పొందుపర్చాలి.
ఒకవేళ అభ్యర్థికి సంబంధించిన కాలమ్‌లు ఉన్నప్పటికీ వాటిని ఖాళీగా లేదా గీత పెట్టి వదిలేయకూడదు. అలాంటి కాలమ్‌లో నిల్ అని గాని, నాట్ అప్లికబుల్ అని గాని, నాట్ నోన్ అని గాని రాయాలి.
కొంత మంది అభ్యర్థులకు అసలు పేరుతో పాటు మరో పేరు కూడా ఉంటుంది. అటువంటి వారు ఈవీఎంలో పేరును ఏ విధంగా రాయోలో నామినేషన్‌ను సమర్పించిన సమయంలోనే రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలి.
దాని ప్రకారమే ఈవీఎంలో పేరును, గుర్తును ముద్రిస్తారు.
గుర్తింపు పొందిన జాతీయ పార్టీల అభ్యర్థుల పేర్లును బట్టి తెలుగు అక్షరమాల ప్రకారం ఈవీఎంలో ముందు స్థానాలను కేటాయిస్తారు. తరువాత రాష్ట్ర పార్టీ, అనంతరం గుర్తింపు లేని రిజిస్టర్ పార్టీల వారిని చేరుస్తారు.
పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు పార్టీల గుర్తింపు పత్రాలు లేకుండానే ముందు నామినేషన్లు సమర్పించినప్పటికీ 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటలులోగా పార్టీల ‘ఎ’, ‘బి’ ఫారాలు సమర్పించాలి. అలాకాని పక్షంలో స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణిస్తారు.
నామినేషన్ సమర్పణ తరువాత అందులో పేర్కొన్న అంశాలన్నీ సత్యమేనని రిటర్నింగ్ అధికారి అభ్యర్థితో ప్రతిజ్ఞ చేయిస్తారు. ఇందుకు సంబంధించిన సర్టిఫికేషన్‌ను కూడా అందజేస్తారు.
ఎన్నికల ఏజెంట్‌ను నియమించుకొనే వారు అప్పుడే దరఖాస్తు ఇవ్వవచ్చు. అభ్యర్థివి 2, సంబంధిత ఏజెంట్‌వి 2 పాస్‌పోర్టు సైజు ఫొటోలు ఇవ్వాలి.
అలాగే నామినేషన్ల సమర్పించిన తరువాత రిటర్నింగ్ అధికారి అభ్యర్థికి రెండు సర్క్యులర్లు అందజేస్తారు. వ్యయ పుస్తకాలు మూడు, రోజువారీ క్యాష్ బుక్, రోజువారి బ్యాంకు బుక్, రోజు వారి ఖర్చుల వివరాలకు సంబంధించి పుస్తకాలు అందజేస్తారు.
అభ్యర్థులూ గుర్తుంచుకోండి..!
Published Fri, Apr 11 2014 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 5:51 AM
Advertisement