
దరఖాస్తులు ఫుల్లు..
జిల్లాలో నాలుగురోజులుగా జరుగుతున్న మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ చివరిరోజు శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది.
సాక్షి, గుంటూరు : జిల్లాలో నాలుగురోజులుగా జరుగుతున్న మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ చివరిరోజు శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. మంగళ, బుధవారాల్లో కేవలం 21 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అనూహ్యంగా శుక్ర, శని వారాల్లో రాజధాని ప్రాంతవాసులతోపాటు జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాం తాల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. రద్దీ ఎక్కువగా ఉండడంతో అర్ధరాత్రి వరకు స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. వ్యాపారం అధికంగా ఉండే షాపులను ఎంచుకుని పోటీలు పడి దరఖాస్తులు చేస్తున్నారు.
గుంటూరు నగరానికి చుట్టుపక్కల ఉన్న రాజధానిప్రాంతాలైన మంగళగిరి, పెదకూరపాడు, అమరావతి, ప్రత్తిపాడు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో ఉన్న షాపులకు దరఖాస్తులు అధికంగా వచ్చినట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రికి 241 షాపులకు 2,497 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో రాజధాని ప్రాంతంలో ఉన్న మద్యం దుకాణాలకు 50కు పైగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో అత్యధికంగా దాచేపల్లి మండలం నడికుడి మద్యం దుకాణానికి శుక్రవారం రాత్రికే 109 దరఖాస్తులు వచ్చాయి.
దరఖాస్తుల గడువు ముగిసే సమయానికి ఈ షాపుకు 300కు పైగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం రాత్రి వరకు వచ్చిన దరఖాస్తుల నుంచి ఎక్సైజ్ శాఖకు సుమారుగా రూ.8 కోట్లు ఆదాయం వచ్చినట్లు ఇన్‌చార్జి డీసీ ఎం.ఆదిశేషు తెలిపారు. శనివారం దరఖాస్తుల గడువు ముగిసే సమయానికి గత ఏడాది కంటే అధికంగా 7వేల దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. దీంతో ఎక్సైజ్ శాఖకు దరఖాస్తుల ద్వారా రూ.25 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.
బారులు తీరిన దరఖాస్తు దారులు
గుంటూరునగరంలోని మహిమ గార్డెన్స్‌లో జరుగుతున్న మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ కౌంటర్ల వద్ద శుక్రవారం తెల్లవారుజాము నుండే దరఖాస్తు దారుల తాకిడితో క్యూలు కిటకిటలాడాయి. శనివారం అర్ధరాత్రి వరకు ఈ ప్రక్రియ కొనసాగుతోంది. రాత్రి వరకు అందిన సమాచారం మేరకు అన్ని షాపులకు దరఖాస్తులు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రాజధానిప్రాంతంతోపాటు నరసరావుపేట డివిజన్‌లోని మద్యం దుకాణాలకు పోటీ ఎక్కువగా ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.
నేడు దరఖాస్తుల పరిశీలన
శనివారంతో దరఖాస్తుల స్వీకరణ ముగియడంతో వచ్చిన దరఖాస్తులను ఆదివారం పరిశీలించనున్నారు. వీటిల్లో సక్రమంగా ఉన్నవాటిని గుర్తించి మిగతావి తిరస్కరిస్తారు. 29న నగరంలోని వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కలెక్టర్ కాంతిలాల్‌దండే ఆధ్వర్యంలో మద్యం దుకాణాలకు లాటరీ నిర్వహించనున్నారు. లాటరీలో మద్యం దుకాణాలు దక్కించుకున్నవారు లెసైన్సు ఫీజులో మూడో వంతు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు జతచేసిన డీడీ రుసుముపోను మిగతా నగదు చెల్లిస్తే సరిపోతుంది.