చదువుకు ఫీజు.. ఎంతైనా చెల్లింపు | Full fee reimbursement for each eligible student in AP | Sakshi
Sakshi News home page

చదువుకు ఫీజు.. ఎంతైనా చెల్లింపు

Published Sun, Dec 1 2019 3:39 AM | Last Updated on Sun, Dec 1 2019 8:38 AM

Full fee reimbursement for each eligible student in AP - Sakshi

జగనన్నవిద్యా దీవెన పథకం
అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌.

సాక్షి, అమరావతి: ఉన్నత చదువులకు స్థోమత లేని పేద పిల్లలు ఇకపై ఎంత వరకు చదువుకుంటే అంత వరకు అయ్యే మొత్తం ఫీజును రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. దీంతో పాటు హాస్టల్, మెస్‌ ఖర్చులకు సైతం ఏకంగా ఏటా రూ.20 వేలు ఇవ్వనుంది. ఈ మేరకు గతంలో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి శనివారం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. నవరత్నాల్లో భాగంగా పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌ విధానంలో మార్పులు చేస్తూ జగనన్న విద్యా దీవెన (రీయింబర్స్‌మెంట్‌ ఆఫ్‌ ట్యూషన్‌ ఫీజు – ఆర్టీఎఫ్‌), జగనన్న వసతి దీవెన (మెయింటెనెన్స్‌ ఫీజు – ఎంటీఎఫ్‌) పథకాలను తెచ్చింది. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీ, దివ్యాంగ వర్గాల విద్యార్థుల చదువుకు పూర్తి ఫీజు, వసతికి ఆర్థిక సాయం పెంచుతూ ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. గతంలో జారీ చేసిన సూచనలు, మార్గదర్శకాలను ఈ మేరకు సవరిస్తూ ఇంటర్‌ మినహా పోస్టు మెట్రిక్‌ కోర్సులు.. ఐటీఐ నుంచి పీహెచ్‌డీ వరకు ఈ పథకాలను అమలు చేస్తుంది.

ఈ పథకాలకు సంబంధించి అర్హులైన విద్యార్థులందరికీ సంతృప్త స్థాయిలో ‘వైఎస్సార్‌ నవశకం ఫీజు రీయింబర్స్‌మెంట్‌’ కార్డు జారీ చేస్తారు. విద్యార్థి ఫీజును సంబంధిత కళాశాల ఖాతాకు, వసతి సొమ్మును తల్లి లేదా సంరక్షకుని అకౌంట్‌కు జమ చేస్తారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో అత్యంత కీలకమైన ఈ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఏడాది (2019–20) నుంచే అమలు చేయనుండటం అతిపెద్ద సామాజిక మార్పునకు నాంది పలకనుంది. కుటుంబంలో ఉన్న అర్హులైన పిల్లలందరికీ ఉన్నత విద్య చదివే అవకాశం దక్కడంతో ఆ కుటుంబం అన్ని విధాలా స్థిరపడుతుంది.   
– జగనన్న విద్యా దీవెన పథకం : అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌. 
– జగనన్న వసతి దీవెన పథకం : హాస్టల్, ఆహార ఖర్చులకు ఐటీఐ విద్యార్థులకు (ఒక్కొక్కరికి) రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు (ఒక్కొక్కరికి) రూ.15 వేలు, డిగ్రీ, ఆపై చదువుతున్న విద్యార్థులకు (ఒక్కొక్కరికి) రూ.20 వేలు ఇస్తారు. ఈ మొత్తాన్ని ఏడాదిలో రెండు దఫాలు (జూలై, డిసెంబర్‌లో)గా అందజేస్తారు.   


  
అర్హతలు, అనర్హతలు  

– విద్యార్థులు రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, బోర్డులకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ కాలేజీల్లో చదువుతుండాలి.  
– డే స్కాలర్‌ విద్యార్థులు, కాలేజీ అటాచ్డ్‌ హాస్టల్స్‌ (సీఏహెచ్‌), డిపార్ట్‌మెంట్‌ అటాచ్డ్‌ హాస్టల్స్‌ (డీఏహెచ్‌) విద్యార్థులు 75 శాతం హాజరు కలిగి ఉండాలి. – కుటుంబ సభ్యులకు కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలు ఉండ కూడదు. ప్రభుత్వ ప్రాయోజిత పథకాల కింద ట్యాక్సీలు, ట్రాక్టర్‌లు, ఆటోలు తీసుకున్న కుటుంబాలకు మినహాయింపు ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో (రెసిడెన్షియల్‌ లేదా కమర్షియల్‌) 1,500 చదరపు అడుగులలోపు సొంత స్థలం కలిగి ఉన్న వారు కూడా అర్హులే.  
– దూర విద్య, ప్రైవేట్, డీమ్డ్‌ యూనివర్సిటీల్లో చదువుతున్న వారు, మేనేజ్‌మెంట్‌ కోటా కింద చేరిన వారు, కుటుంబ సభ్యుల్లో ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనర్‌ ఉన్న వారు అనర్హులు. 
  
ఆదాయ పరిమితి  
– కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.50 లక్షల కంటే తక్కువ ఉండాలి.  
– కుటుంబానికి 10 ఎకరాల మాగాణి, 25 ఎకరాల మెట్ట భూమి ఉండవచ్చు. లేదా.. మెట్ట, మాగాణి కలిపి 25 ఎకరాల లోపు ఉండాలి.  
– వార్షికాదాయంతో సంబంధం లేకుండా శానిటరీ వర్కర్స్‌ పిల్లలు అర్హులు.  

దరఖాస్తు ఇలా.. 
– ఆయా కళాశాలల యాజమాన్యాలే అర్హత గల విద్యార్థుల పూర్తి వివరాలను జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో ఆయా విభాగాలకు అప్‌లోడ్‌ చేస్తాయి. 
– ఆదాయ పరిమితి పెంచినందున తహశీల్దార్‌ ఇచ్చే ధ్రువీకరణ పత్రాన్ని పరిగణనలోకి తీసుకుని కొత్త విద్యార్థులకు అర్హత కల్పిస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement