సైబర్‌ నేరగాళ్ల ముఠా అరెస్ట్‌ | A Gang Of Cyber Criminals Arrested | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరగాళ్ల ముఠా అరెస్ట్‌

Published Sat, Jun 16 2018 10:05 AM | Last Updated on Wed, Apr 3 2019 9:21 PM

A Gang Of Cyber Criminals Arrested - Sakshi

మాట్లాడుతున్న సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌  (ఇన్‌సెట్‌) నేరగాళ్ల నుంచి స్వాధీనపర్చుకున్న  సెల్‌ ఫోన్లు, సిమ్‌ కార్డులు 

సాక్షి, ఖమ్మంక్రైం : సైబర్‌ క్రైం–క్రిమినల్స్‌ ఇతివృత్తంతో ఇటీవల విడుదలైన ‘అభిమన్యుడు’ సినిమాను చూశారా..? సైబర్‌ నేరాలు జరిగే తీరును ఇది కళ్లకు కట్టినట్లు చూపింది. విద్యావంతులైనా, మేధావులైనా, గొప్పోళ్లయినా.. ఎవరైనా సరే, సైబర్‌ నేరగాళ్లకు చిక్కి ఎలా మోసపోతారో ఆ సినిమా వివరించింది. ‘‘అది సినిమా..! అలా ఎలా మోసం చేస్తారు? అది సాధ్యమా..?’’ అనుకున్న వాళ్లు కూడా ఉండి ఉంటారు. బయట జరుగుతున్న సైబర్‌ మోసాలే ఆ సినిమాకు ఇతివృత్తంగా మారాయని మనం నమ్మాల్సిందే. ఎందుకంటే, ఆ సినిమాలో మాదిరిగానే, రెండేళ్ల నుంచి బ్యాంక్‌ ఖాతాదారుల నెత్తిన టోపీ పెట్టిన–పెడుతున్న సైబర్‌ నేరగాళ్ల ముఠాను ఖమ్మం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

వీళ్లే దొంగలు...    
ఐదుగురితో కూడిన సైబర్‌ నేరగాళ ముఠాను అరెస్ట్‌ చేసినట్టు ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ (సీపీ) తఫ్సీర్‌ ఇక్బాల్‌ తెలిపారు. ఆయన శుక్రవారం సీపీ క్యాంప్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన ఉల్లింటి సలీం మాలిక్‌ అలియాస్‌ సలీం, నారాయణపల్లి అబ్దుల్, ముద్దనూరు మండలం కొలవలి గ్రామస్తుడు బట్టు రామాంజనేయులు అలియాస్‌ రాంజీ, మైలవరం మండలానికి చెందిన దండి వేణుగోపాల్‌ అలియాస్‌ వేణు, ఇదే మండలంలోని వేపరాళ్ల గ్రామస్తుడు బడిగించాల మనోహర్‌ కలిసి న్యూఢిల్లీలో రెండేళ్ల  క్రితం ‘ఏఏఏ’, ‘న్యూహోమ్‌’, ‘ఫాస్ట్‌ అండ్‌ ఈజీ’ అనే కాల్‌ సెంటర్లలో టెలీకాలర్స్‌గా పనిచేశారు. అక్కడ వీరి పనేమిటంటే... రోజుకు 100 నుంచి 120 మంది బ్యాంక్‌ ఖాతాదారులకు ఫోన్‌ చేయడం. ‘మేము ఫలానా బ్యాంక్‌ హెడ్‌ ఆఫీస్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నాం. ఈ ఏటీఎం కార్డు అప్‌డేట్‌ చేయాలి. ఆధార్‌ కార్డు లింక్‌ చేయాలి’ అని చెప్పడం. ఖాతాదారుల ఏటీఎం కార్డు నంబర్, సీవీవీ నంబర్, ఓటీపీ నంబర్‌ సేకరించడం. వాటిని తమ కాల్‌ సెంటర్‌ యజమానికి ఇవ్వడం. తమ యజమానులు చేస్తున్నది ఆన్‌లైన్‌ మోసమన్న విషయం వీరికి తెలుసు. సదరు సంస్థ నుంచి వీరికి దండిగానే డబ్బు ముట్టడంతో వీరు విలాసవంతమైన జీవితానికి అలవాటయ్యారు. మద్యానికి, బెట్టింగ్‌లకు బానిసలయ్యారు. దీంతో డబ్బు సరిపోలేదు. ‘ఎవరి తరఫునో ఎందుకు..? మనమే డైరెక్టుగా జనాలను మోసగించి డబ్బు గడించొచ్చు కదా..’ అనుకున్నారు. ఈ ఐదుగురూ తమ సంస్థల నుంచి బయటపడ్డారు. ముఠాగా ఏర్పడ్డారు. గడించిన అనుభవంతో, రెండేళ్ల క్రితం సైబర్‌ నేరాలకు దిగారు. ప్రతి మూడు–నాలుగు నెలలోకాసారి సైబర్‌ నేరాల పద్ధతులు మార్చసాగారు.


ఇలా మొదలైంది..
వీరు 2017 ఆగస్టులో నేరాలు మొదలుపెట్టారు. పూర్వం, తమ సంస్థ నుంచి ఎలాగైతే ఫోన్‌ చేసి వివరాలు సేకరించేవారే, అచ్చం అలాగే చేయసాగారు. ఖాతాదారులకు ఫోన్‌ చేసి ఏటీఎం, సీవీవీ నంబర్, ఓటీపీ (వన్‌ టైం పాస్‌వర్డ్‌) తెలుసుకునే వారు. వాటి ద్వారా సదరు ఖాతాదారుల బ్యాంక్‌ అకౌంట్ల నుంచి డబ్బులను తమ అకౌంట్లలోకి మళ్లించేవారు. ఆన్‌లైన్‌ ద్వారా షాపింగ్‌ చేసేవారు. ఇలా విలాసవంతమైన జీవితం గడపసాగారు. ఆ సంవత్సరం డిసెంబర్‌ వరకు ఇలాగే చేశారు. జనవరి 2018లో రూటు మార్చారు. తాము సేకరించిన ఫోన్‌ నంబర్లకు ఫోన్‌ చేసేవారు. పెద్ద పెద్ద బ్రాండ్‌ కంపెనీల పేర్లు చెప్పి, వాటి కస్టమర్‌ కేర్‌ నుంచి మాట్లాడుతున్నామని నమ్మించేవాళ్లు.

‘లక్కీ డ్రాలో మీ నంబర్‌ ఎంపికైంది. 25వేల నుంచి 30వేల రూపాయల విలువైన ఫోన్‌/వస్తువు మీకు కేవలం మూడువేల నుంచి నాలుగువేల రూపాయలకే వస్తుంది. మీ పూర్తి అడ్రస్‌ చెబితే పంపిస్తాం. డబ్బును మా అకౌంట్‌లో వేయాలి’ అని, అకౌంట్‌ నంబర్‌ ఇచ్చేవాళ్లు. ఏవేవో పనికిరాని వస్తువులను ప్యాక్‌ చేసి వీపీపీ/సీఓడీ పద్ధతిలో పార్శిల్‌ పంపేవారు. సదరు చిరునామాదారులు వాటిని చూసుకుని, వాటిని పంపిన సంస్థకు వెంటనే ఫోన్‌ చేసేవారు. తమ డబ్బు తిరిగిచ్చేయాలని అడిగేవారు. అప్పుడు ఆ సైబర్‌ మోసగాళ్లు.. ‘సరే, మీ డబ్బును వాపస్‌ చేస్తాం. మీ ఏటీఎం కార్డ్, సీవీవీ నంబర్‌ చెప్పండి. కొద్దిసేపటి తరువాత ఓటీపీ నంబర్‌ మెసేజ్‌ వస్తుంది. దానిని చూసి చెప్పగానే మీకు డబ్బు వచ్చేస్తుంది’ అని నమ్మించేవారు. సదరు చిరునామాదారులు చెప్పిన ఓటీపీ నంబర్‌ ఆధారంగా ఈ మోసగాళ్లు తమ మొబైల్‌ వాలెట్‌లోకి (చిరునామాదారుడి ఖాతాలోని) డబ్బును ట్రాన్స్‌ఫర్‌ చేసుకునేవారు. ఆ తరువాత బ్యాంక్‌ అకౌంట్‌లో జమ చేసుకునేవారు.

2018 మార్చిలో వీరు మరోసారి రూటు మార్చారు. ఈసారి ఇంకో పద్ధతిలో మోసగించడం మొదలెట్టారు. వివిధ రకాల షాషింగ్‌ వెబ్‌సైట్లలో మొబైల్‌ నంబర్‌ రిజిస్టర్‌ చేసుకునేవారు. దానిని ఏదో ఒక ఫేస్‌బుక్‌ అకౌంట్‌కు ఫేక్‌ లింక్‌ పంపి, దానిని హ్యాక్‌ చేసేవారు. ఆ ఫేస్‌బుక్‌ ఖాతాదారు ఐడీ, పాస్‌వర్డ్‌ తస్కరించేవారు. అతని/ఆమె పేరుతో దగ్గరి మిత్రులతో చాట్‌ చేసేవారు. ‘ఏటీఎం కార్డు ఫొటో పెడితే డబ్బులు వస్తాయి’ అని నమ్మించేవారు. ఏటీఎం పిక్‌ ద్వారా కార్డు, సీవీవీ నెంబర్‌ తెలుసుకునేవారు. ఆ తరువాత ‘వేరే ఫ్రెండ్‌ను ఇన్‌వైట్‌ చేస్తే (ఆహ్వానిస్తే) డబ్బులు వస్తాయి’ అని చెప్పి ఓటీపీ నంబర్‌ కూడా చాటింగ్‌లోనే మెసేజ్‌ చేయాలని చెప్పేవారు. అలా బ్యాంక్‌ ఖాతా నుంచి నగదును ఈ నేరగాళ్లు తమ మనీ వాలెట్‌లోకి, అక్కడి నుంచి బ్యాంక్‌ అకౌంట్‌లోకి బదిలీ చేసుకునేవారు. ఇలా మే నెల వరకు మోసగించారు.

ఇలా చిక్కారు...
ఇలా వీరి సైబర్‌ దందా రెండేళ్లపాటు నిరాటంకంగా సాగింది. ఖమ్మం త్రీటౌన్‌ ప్రాంతంలో ముగ్గురు ఖాతాదారుల నుంచి డబ్బును ఓటీపీ ద్వారా తస్కరించారు. బాధితులు త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇలాంటివే... ఖమ్మం వన్‌ టౌన్‌లో రెండు, సత్తుపల్లిలో రెండు, వైరాలో ఒకటి సైబర్‌ క్రైం కేసులు నమోదయ్యాయి. వీటిపై సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ దృష్టి సారించారు. ఆయన మార్గదర్శకత్వంలో ఖమ్మం ఏసీపీ వెంకట్రావు ఆధ్వర్యంలో ఖమ్మం త్రీ టౌన్‌ సీఐ వెంకన్నబాబు, సైబర్‌ క్రైమ్‌ సిబ్బంది రంగంలోకి దిగారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ప్రత్యేక పోలీస్‌ బృందం తీవ్రంగానే కసరత్తు చేసింది. వెతకగా.. వెతకగా... తీగ దొరికింది. దానిని పట్టుకుని లాగితే.. డొంకంతా కదిలింది. సైబర్‌ నేరగాళ్ల వివరాలు తెలిశాయి. ఈ ముఠాను వైఎస్సార్‌ జిల్లాలో, ఢిల్లీలో అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ ముఠా ఖమ్మం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో బ్యాంక్‌ ఖాతాదారుల నుంచి దాదాపుగా రూ.4లక్షలకు పైగా కాజేసినట్టు తేలింది. నేరగాళ్ల మనీ వాలెట్ల నుంచి రూ.1,07,000ను బాధితుల అకౌంట్లలోకి తిరిగి జమ చేయించారు. ఈ నేరగాళ్ల నుంచి రూ.1.39లక్షల విలువైన పది సెల్‌ఫోన్లు, రూ.1.04లక్షల నగదు, 15 సిమ్‌ కార్డులు స్వాధీనపర్చుకున్నారు. అరెస్ట్‌ చేసి కోర్టుకు అప్పగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement