లైన్‌ అక్కర్లేదు..ఆన్‌లైన్‌ చాలు!  | General Ticket Booking With Android Cell Phone | Sakshi
Sakshi News home page

లైన్‌ అక్కర్లేదు..ఆన్‌లైన్‌ చాలు! 

Published Sun, Jan 19 2020 8:15 AM | Last Updated on Sun, Jan 19 2020 8:15 AM

General Ticket Booking With Android Cell Phone - Sakshi

సీతంపేట: ఓ వైపు ప్లాట్‌ఫారంపై రైలు ఉంటుంది. ఇటు చాంతాడంత క్యూ ఉంటుంది. నిత్యం రైళ్లలో ప్రయాణించే వారికి లైన్‌లో నించుని టికెట్‌ తీసుకోవడం ప్రహసనమే. దీంతో పాటు ప్లాట్‌ఫాం తీసుకోవడం కూడా కష్టమవుతూ ఉంటుంది. చిన్నపాటి దూరానికి రైళ్లను ఆశ్రయించే వారి సంఖ్య జిల్లాలో ఎక్కువగా ఉంది. రద్దీగా ఉండే స్టేషన్లలో అప్పటికప్పుడు వీరికి టికె ట్‌ తీసుకోవడం కష్టమైన పనే. అలాంటి వారి కోసం దక్షిణ మధ్య రైల్వే విభాగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అరచేతిలో ఉండే ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ద్వారా స్టేషన్‌కు 15 మీటర్ల నుంచి ఐదు కిలోమీట ర్ల లోపు దూరంలో ఉండి సాధారణ టికెట్, ప్లాట్‌ఫాం టికెట్‌ కొనుగోలు చేసేందుకు యూటీఎస్‌ యాప్‌ను రూపొందించింది.  

నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌లలో ప్లాట్‌ఫాం, సాధారణ టికెట్‌ కొనుగోలు చేయాలంటే రైలు సమయాన్ని బట్టి యుద్ధం చేయాల్సిందే. టికెట్‌ కొనే సమయానికి రైలు వెళ్లిపోయే పరిస్థితి ఉంటుంది. ఆ ఇబ్బందిని తొలగించేందుకు రైల్వేశాఖ ఈ యాప్‌ను సిద్ధం చేసింది. వాస్తవానికి ఇప్పటి వరకు ఆన్‌లైన్‌ టి కెట్‌ విధానం రిజర్వేషన్‌ ప్రయాణానికి మాత్ర మే పరిమితం. ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ విధానాన్ని ఇకపై జనరల్‌ టికెట్‌కూ విస్తరించారు. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వే అధికారుల ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ టికెట్‌ సిస్టమ్‌ (యూటీఎస్‌) యాప్‌ను అందుబాటులో ఉంచారు. ఈ–టికెట్‌ వినియోగం ద్వారా పేపరు రహిత రైలు టికెట్‌ విధానం అమల్లోకి రానుంది. ఈ యాప్‌ ద్వారా జీపీఎస్‌ అనుసంధానం ఉన్న అన్ని మొబైల్స్‌ నుంచి ప్రతి ఒక్కరూ క్షణాల్లో జనరల్, ప్లాట్‌ఫాం సీజన్‌ టికెట్లు పొందే వెసులు బాటు రైల్వే అధికారులు కల్పించారు. ఈ యాప్‌ ద్వారా టికెట్‌ పొందే విధానంలో కొన్ని నిబందనలు/షరతులను మా త్రం ప్రయాణికులు తప్పక పాటించాల్సి ఉంటుంది.  

అన్ని రైళ్లకూ జనరల్‌ టికెట్‌ 
ఈ యాప్‌ ఉపయోగించి పాసింజర్, ఫాస్ట్‌ పాసింజర్, ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్‌ తదితర రై ళ్లలో క్షణాల్లో జనరల్‌ టిక్కెట్లు బుక్‌ చేసు కోవచ్చు. ఒక వేళ పెద్దలకు ఎవరికైనా టికెట్‌ బుక్‌ చేస్తే వారి వద్ద సెల్‌ఫోన్‌ లేకుంటే బుకింగ్‌ ఐడీ నంబర్, మొబైల్‌ నంబర్‌ చెబితే కౌంటర్‌ వద్ద టికెట్‌ పొందే అవకాశం ఉంది.

ప్రత్యేకతలు 
రైల్వే బుకింగ్‌ కౌంటర్‌ వద్ద చాంతాడంత క్యూలో నిల్చుని అవస్థలు పడే అవసరం లేకుండా ఇంటి నుంచి బయల్దేరి రైల్వేస్టేషన్‌కు చేరే లోపే స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా యూటీఎస్‌ యాప్‌ నుంచి టికెట్‌ పొందవచ్చు. ఈ యాప్‌ ద్వారా దక్షిణ మధ్య రైల్వే పరిదిలోని ఏ యూటీఎస్‌ స్టేషన్‌ నుంచైనా సీజన్, ప్లాట్‌ఫారం, జనరల్‌ టిక్కెట్లు పొందవచ్చు. ఒకేసారి నాలుగు టిక్కెట్లను బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. షో టికెట్‌ ఆప్షన్‌ ద్వారా టీసీకి వివరాలను చూపించి ప్రయాణం చేయవచ్చు.  

యాప్‌ డౌన్‌లోడింగ్‌ ఇలా.. 
4 ఈ యాప్‌ను ఉచితంగా ఆండ్రాయిడ్‌ విండోస్, ఐఫోన్లలో ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. గూగుల్‌ ప్లే స్టోర్‌లోకి వెళ్లి యూటీఎస్‌ అనే ఆంగ్ల అక్షరాలను టైప్‌ చేసి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 
4 మొబైల్‌ నంబర్, ఓ పాస్‌వర్డ్‌ను వ్యక్తిగత వివరాలతో ప్రభుత్వం జారీ చేసిన ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, పాన్, స్టూడెంట్‌ ఐడీ తదితర కార్డులకు సంబంధించిన ఏదో ఒక నంబర్‌ను ఈ యాప్‌లో నమోదు చేసుకుని ఇన్‌స్టాల్‌ చేయాలి.  

నిబంధనలు.. 
ఏ ప్రయాణ టిక్కెట్లను రైలు ఎక్కేందుకు 3 గంటల ముందుగా బుక్‌ చేసుకోవాలి. అంటే టికెట్‌ బుక్‌ చేసిన 3 గంటల్లోపు ప్ర యాణం చేయాల్సి ఉంటుంది. ముందుగా టికెట్‌ బుక్‌ చేద్దామంటే ఈ యాప్‌ పనిచేయదు. అలాగే టికెట్‌ బుక్‌ చేసిన సమయానికి మూడు గంటలు దాటితే టికెట్‌ పనిచేయదన్నమాట.  
ఏ రైల్వే స్టేషన్‌కు 15 మీటర్ల నుంచి 5 కిలోమీటర్ల దూరం నుంచి మాత్రమే టికెట్‌ బుక్‌ చేసుకునేందుకు యాప్‌ ఉపయోగపడుతుంది. దూరాన్ని జీపీఎస్‌ ద్వారా లెక్కిస్తుంది.
ఏ ఫ్లాట్‌ ఫాం టికెట్‌ తీసుకోవాలంటే స్టేషన్‌కు 15 మీటర్ల దూరం నుంచి 2 కిలోమీ టర్ల లోపు దూరంలో ఉన్న ప్రయాణికులు మాత్రమే అర్హులు.  
ఏ పేపర్‌ టికెట్‌ కావాలంటే బుకింగ్‌ కౌంటర్‌ వద్దకు వెళ్లి మొబైల్‌ నంబర్, బుకింగ్‌ ఐడీని చూపించి పొందవచ్చును. ఈ సమయంలో ప్రయాణికుడి ఐడీ కార్డు తప్పనిసరిగా టీసీకి చూపాల్సి ఉంటుంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement