
సీమాంధ్రకు ఆశ్చర్యపడే ప్యాకేజీ! : డీఎస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని తాను ఆశించడం లేదని, దానికోసం ఎవరినీ అడగలేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ స్పష్టంచేశారు. కొందరు తాము సీఎంలమన్నట్టు చెప్పుకుంటున్నా తాను అలా అనడం లేదన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరుతున్న సమయంలో సీమాంధ్రులను సంతోషపర్చేం దుకు హైదరాబాద్‌పైనో, ఇంకో విషయంలోనో కొన్ని చిన్నచిన్న సర్దుబాట్లు తప్పకపోవచ్చని,రెండుప్రాంతాల మధ్య సద్భావనకోసం తెలంగాణ ప్రజలు అంగీకరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.గురువారం తన నివాసంలో డీఎస్ మీడియాతో మాట్లాడారు.
రెండుప్రాంతాల ప్రజలకు న్యాయం చేసేందుకు కేంద్రమంత్రుల బృందం ఎంతో కసరత్తు చేసి నివేదికను రూపొందిస్తోందని ఆయన తెలిపారు. అన్ని ప్రాంతాల వారు ఆమోదించేలా ఈ నివేదిక ఉండబోతోందన్నారు. పదేళ్ల ఉమ్మడి రాజధాని గడువుపై కొందరు ఏవేవో మాట్లాడుతున్నారని, పదేళ్లే కాదు మరో రెండేళ్లు అదనంగా ఉన్నా ఎవరికీ అభ్యంతరం ఉండరాదని చెప్పారు. చిన్నచిన్న సర్దుబాట్లను బూచిగా చూపి ప్రజలను రెచ్చగొట్టి తెలుగుజాతి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొందరు ప్రయత్నించవచ్చని, వాటికి ఆస్కారమివ్వరాదని కోరారు. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కోరుతున్న నేతలు అదెంతవరకు ఆచరణయోగ్యమో ఆలోచించాలన్నారు. ైెహ దరాబాద్ రెవెన్యూ జిల్లా, జీహెచ్‌ఎంసీ పరిధిని మాత్రమే ఉమ్మడి రాజధానిగా చేయొచ్చని తెలిపారు. కేంద్రం సీమాంధ్రకోసం రూపొందిస్తున్న ప్యాకేజీ వారినే ఆశ్చర్యానికి గురిచేసేలా ఉండబోతుందన్నారు.