తమ్ముళ్లేనట ఎమ్మెల్యేలు | GO issuing in the name of TDP leaders in place of elected MLAs | Sakshi
Sakshi News home page

తమ్ముళ్లేనట ఎమ్మెల్యేలు

Published Wed, Apr 5 2017 1:00 AM | Last Updated on Sat, Aug 11 2018 3:37 PM

తమ్ముళ్లేనట ఎమ్మెల్యేలు - Sakshi

తమ్ముళ్లేనట ఎమ్మెల్యేలు

ప్రత్యేక అభివృద్ధి నిధుల మంజూరులో బాబు సర్కారు అదే బరితెగింపు
ఎన్నికైన ఎమ్మెల్యేల పేరు మార్చి టీడీపీ నేతల పేరుతో జీవోలు


- సంతనూతలపాడులో ఎమ్మెల్యేగా జనం ఎన్నుకున్నది సురేశ్‌ని..
- కానీ బాబు సర్కారు జీవోలో ఎమ్మెల్యేగా విజయ్‌కుమార్‌
- నియోజకవర్గంలో సీసీ రోడ్లకు రూ.2 కోట్లు
- మార్చి 31న రూ.62 కోట్లు మంజూరు చేస్తూ 31 జీవోలు జారీ
- ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్నచోట్ల టీడీపీ నేతల పేర్లతో నిధుల మంజూరు
- ఎస్‌డీఎఫ్‌ కాదు.. టీడీపీ డెవలప్‌మెంట్‌ ఫండ్‌
- తీరుమారని సీఎం.. అదే పక్షపాతం.. విస్తుపోతున్న అధికారులు


సాక్షి, అమరావతి: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి రాజ్యాంగ నిబంధనలను, చట్టాలను తుంగలో తొక్కుతూ ప్రజాస్వామాన్ని ఖూనీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక అభివృద్ధి నిధుల (ఎస్‌డీఎఫ్‌) మంజూరు విషయంలో తన మొండితనాన్ని, దారుణమైన బరితెగింపును అదేతీరులో కొనసాగిస్తున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల విషయంలో కక్షగట్టినట్లు వ్యవహరిస్తున్నారు. ‘నలుగురూ నవ్విపోనీ.. నాకేటి సిగ్గు’ అన్న చందంగా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పేర్లను మార్చేస్తూ ఏకంగా జీవోలు జారీ చేసేస్తున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నియోజకవర్గాలలో తెలుగుదేశం నేతలనే ఎమ్మెల్యేలుగా పేర్కొంటూ వారి పేరుమీదే నిధులు విడుదల చేస్తున్నారు. ఎన్నుకున్న ప్రజలను వెర్రివాళ్లన్నట్లుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఇలా సంకుచితంగా.. ప్రతిపక్ష పార్టీ విషయంలో కక్షగట్టినట్లు వ్యవహరించడాన్ని అధికారులు కూడా తప్పుపడుతున్నారు. ఇవి ప్రత్యేక అభివృద్ధి నిధులా లేక తెలుగుదేశం పార్టీ అభివృద్ధి నిధులా అని ప్రశ్నిస్తున్నారు.

సంతనూతలపాడు ఎమ్మెల్యే సురేశ్‌ కాదట..
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజక వర్గం నుంచి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎ.సురేశ్‌ను చంద్రబాబు ప్రభుత్వం మార్చేసింది. ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి సంతనూతలపాడు అసెంబ్లీ నియోజక వర్గంలో సీసీ రహదారుల నిర్మాణానికి రెండు కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 31వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల్లో సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే బి.ఎన్‌. విజయ్‌ కుమార్‌ వినతి మేరకు సీసీ రహదారులకు రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రణాళికా శాఖ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి సంజయ్‌గుప్తా జీవో ఆర్‌టీ.236 జారీ చేశారు.

సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా ఎ.సురేశ్‌ ఎన్నికైనప్పటికీ జీవోలో మాత్రం ఎమ్మెల్యేగా ఎన్నిక కాని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి విజయ్‌కుమార్‌ను ఎమ్మెల్యేగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేయడం చూసి అధికార యంత్రాంగం విస్తుపోతోంది. వైఎస్సార్‌సీపీ నుంచి విజయం సాధిస్తే ఎమ్మెల్యేగా గుర్తించరా..అయినా ఇలా పేర్లు మార్చేసి ఏకంగా జీవోలు జారీ చేయడం మునుపెన్నడూ ఎరగమని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం బరితెగింపు చూసి నివ్వెరపోతున్నారు.

ఆది నుంచీ చంద్రబాబుది అదేతీరు...
ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు అభివృద్ధి నిధుల మంజూరులో ముఖ్యమంత్రి చంద్ర బాబు తొలి నుంచి వివక్షతో వ్యవహరిస్తు న్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో నియోజకవర్గాల అభివృద్ధికి ఒక్కో ఎమ్మెల్యేకు రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసేవారు. ఇందులో ప్రతిపక్షమా, ఇతర పార్టీలా అనే తేడా లేకుండా అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ఈ నిధులను మంజూరు చేసేవారు. అనంతరం ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఎమ్మెల్యేలు జారి పోకుండా కాపాడుకోవడానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి విచక్షణాధికారాలతో మంజూరు చేసేలాగ ప్రత్యేక అభివృద్ధి నిధిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు చంద్రబాబు కూడా ఆ ప్రత్యేక నిధిని కొనసాగిస్తూ నియోజకవర్గాల అభివృద్ధి నిధికి మంగళం పాడారు.

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి నిధులను మంజూరు చేయకుండా వివక్షతో వ్యవహరిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు విజ్ఞాపన పత్రాలను సమర్పించినప్పటికీ పట్టించుకోకుండా అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, లేదా టీడీపీ ఇన్‌చార్జి నాయకులనే ఎమ్మెల్యేలుగా పేర్కొంటూ వారి పేరుతో నిధులను మంజూరు చేస్తున్నారు.

టీడీపీ సంక్షేమ నిధిలా మార్చేశారు..
ఆర్థిక సంవత్సరం చివరి రోజు మార్చి 31వ తేదీన హడావుడిగా ప్రత్యేక అభివృద్ధి నుంచి 31 నియోజకవర్గాలకు రెండేసి కోట్ల రూపాయల చొప్పున 62 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ 31 జీవోలను జారీ చేశారు. మాడుగుల నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆ ఎమ్మెల్యేను కాదని మాజీ  ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడి పేరుతో  నిధులను మంజూరు చేశారు. అలాగే మార్కాపురం నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తుండగా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడి పేరు తో నిధులను విడుదల చేశారు.

ప్రత్యేక అభివృద్ధి నిధిని తెలుగుదేశం పార్టీ సంక్షేమ నిధిగా చంద్రబాబు సర్కారు మార్చేసింది. ఇందులో భాగంగానే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలున్న చోట టీడీపీ ఇన్‌చార్జీల పేరుతో నిధులను మంజూరు చేస్తున్నారు. అలాగే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో టీడీపీ నేతలనే ఎమ్మెల్యేలుగా పేర్కొంటూ జీవోలు జారీ చేయడం ఈ ప్రభుత్వ అనైతిక, అప్రజాస్వామిక చర్యలకు పరాకాష్ట. గతంలో డోన్‌ నియోజకవర్గం ఎమ్మెల్యేగా వైఎస్సార్‌సీపీ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఉండగా కేఈ ప్రతాప్‌ (డిప్యూటీ సీఎం కేఈ సోదరుడు) పేరుతో నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement