
మాట్లాడింది నేను కాదు... భగవంతుడి లీల
కర్నూలు : ఎల్బీ స్టేడియంలో ఏపీఎన్జీవోల సభలో మాట్లాడింది తాను కాదని.... అదంతా భగవంతుడి లీల అని హిందూవాహిని సభ్యురాలు సత్యవాణి అన్నారు. గురువారం కర్నూలులో జరిగిన మహిళ గర్జన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ ఏపీ ఎన్జీవోల సభలో తాను మాట్లాడే షెడ్యూల్ ఏమీ లేకపోయినా ... సభకు హాజరైన తనను రెండు నిమిషాలు మాట్లాడాలని నిర్వహకుల కోరిక మేరకు మాట్లాడినట్లు తెలిపారు. అయితే అక్కడ తాను ఏమి మాట్లాడానో గుర్తు లేదని ... భగవంతుడు పలికించిన మాటలని అన్నారు.
ఏపీ ఎన్జీవోల సభకు ఏ గేటు నుంచి లోపలకు వెళ్లాలో తెలియక తాను వెతుకుతున్నప్పుడు సీమాంధ్ర మహిళ ఉద్యోగులు తనను చేయి పట్టుకుని తీసుకు వెళ్లారని సత్యవాణి గుర్తు చేసుకున్నారు. ఆ దృశ్యం తనకు చికాగోలో జరిగిన సర్వ మత సమ్మేళనానికి వివేకానందుడు ఎలా వెళ్లారో... తనకు అలాగే జరిగిందని ఆమె తెలిపారు.
ఎన్నికలప్పుడు స్వీటు స్వీటుగా ఓట్లు వేయించుకున్న రాజకీయ నేతలు .... ప్రస్తుతం ప్రజలను అనాధల్లా వీధిన పడేశారని సత్యవాణి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన విషయంలో నేతలు వైఖరిని ఆమె తప్పుపట్టారు. సీమాంధ్రులు గత 44 రోజుల నుంచి ఆందోళనలు, నిరసనలు తెలియచేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవటం దౌర్భగ్యమైన విషయమన్నారు. 'బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ' అన్నట్లుగా కోట్లాదిమంది ప్రజలు చీమల్లా బారులుతీరి తమ హక్కు కోసం నినదిస్తున్నారని .... ప్రజల తీర్పుకు ఎవరైనా తలవంచాల్సిందేనని సత్యవాణి అన్నారు.