పుష్కర పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీరు.. ‘మాటలు కోటలు దాటి.. చేతలు పీటను దాటని’ బాపతుగా ఉంది.
పుష్కర పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీరు.. ‘మాటలు కోటలు దాటి.. చేతలు పీటను దాటని’ బాపతుగా ఉంది. జిల్లాలో ఘాట్ల అభివృద్ధి నుంచి రోడ్ల విస్తరణ వరకూ ఆర్భాటంగా గుప్పించిన ప్రకటనలు కార్యాచరణకు వచ్చేసరికి.. తుస్సుమంటున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆదేశించిన పని విషయంలోనే ఇలాంటి తాత్సారం తప్పకపోవడం గమనార్హం.
సాక్షి, రాజమండ్రి :రాజమండ్రి నుంచి మధురపూడి విమానాశ్రయం రోడ్డును నాలుగు లేన్లుగా అభివృద్ధి చేసే పనికి సంబంధించి రెండోదశకు ఆర్‌అండ్‌బీ శాఖ రెండుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఫలితంగా అధికారులు సందిగ్ధంలో పడ్డారు. ఈ రోడ్డు విస్తరణను ఎట్టి పరిస్థితుల్లోనూ పుష్కరాల నాటికి చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఆదేశించారు. కానీ ఈ పనులకు కాంట్రాక్టర్లు ముందుకు రాని దుస్థితి నెలకొంది. ఇప్పటికే ఈ పనికి ఆర్‌అండ్‌బీ అధికారులు రెండుసార్లు టెండర్లు పిలిచారు. ప్రస్తుతం మూడోసారి టెండర్లు పిలిచి ఈ నెల 19న మరోసారి తెరవనున్నారు. ఈసారి కూడా ఎవరూ ముందుకు రాకపోతే పుష్కరాల నాటికి ఈ పని పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
ఆర్ అండ్ బి పుష్కర పనుల్లో ఇదే తలమానికం
విమానాశ్రయం రోడ్డు విస్తరణ పని అంచనా విలువ రూ.33 కోట్లు. ఈ పనిని రెండు దశలలో చేపడుతున్నారు. మొద టి దశలో ఐదు కిలోమీటర్ల స్తరణకు రూ.ఐదు కోట్లు కేటాయించగా, రెండో దశలో రూ.28 కోట్లతో మరో ఏడు కిలోమీటర్లు విస్తరిస్తున్నారు. రెండో దశ పనులకు ఇటీవల టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. పుష్కరాల సందర్భంగా ఆర్‌అండ్‌బీ చేపడుతున్న మొత్తం పనుల్లో ఈ పనే పెద్దది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించాలని స్వయంగా ఆదేశించారు. జీఓలతో సంబంధం లేకుండా నిధులు విడుదల చేస్తున్నట్టు అధికారులకు చెప్పారు. కాగా అవే పనులు ఇప్పుడు జరుగుతాయా లేదా అనే సందిగ్ధంలో పడ్డాయి. ఆర్‌అండ్‌బీ శాఖకు ముందుగా ప్రభుత్వం రూ.87.50 కోట్ల విలువైన పనులు మంజూరు చేసింది. ఆ తర్వాత సీఎం మరి కొన్ని పనులు సూచించారు. వీటితో కలిపి పనుల విలువ రూ.333 కోట్లకు చేరింది. ఈ నిధులతో సుమారు 42 పనులను ఆర్‌అండ్‌బీ అధికారులు చేపడుతున్నారు.
కాంట్రాక్టర్ల వ్యూహం ఫలితమే..!
విమానాశ్రయం రోడ్డు విస్తరణ రెండో దశ పనులకు టెండర్లు దాఖలు కాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు కాంట్రాక్టర్లు ఉద్దేశపూర్వకంగానే టెండర్లలో ఎవరూ పాల్గొనకుండా వ్యూహం పన్నారన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ టెండర్లు వేయకపోతే ముఖ్యమంత్రి సూచించిన పని కాబట్టి నామినేటెడ్ ప్రాతిపదికన అత్యవసర పని కింద దక్కించుకుని అదనంగా ఆర్థిక ప్రయోజనం పొందవచ్చన్న ఎత్తుగడ కూడా లేకపోలేదని విమర్శలు వినవస్తున్నాయి.