భక్తులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలి
మహానంది క్షేత్రానికి బందోబస్తు నిమిత్తం వచ్చిన పోలీసులు భక్తుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ఎలాంటి గొడవలకు దిగరాదని నంద్యాల డీఎస్పీ అమర్‌నాథనాయుడు ఆదేశించారు.]
మహాశివరాత్రి బందోబస్తులో భాగంగా మహానందికి వచ్చిన సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధులు పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. భక్తులరద్దీకి అనుగుణంగా సంయమనం పాటించాలన్నారు. ఎవరికి కేటాయించిన స్థానాల్లో వారు ఉండి విధులను నిర్వహించాలని పేర్కొన్నారు. నంద్యాల రూరల్ సీఐ శివప్రసాద్ మాట్లాడుతూ విధుల్లో అలసత్వం వహిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.
క్యూలైన్లు, స్వామివారి ఆలయం, కోనేరులు, ఇతర ముఖ్యరద్దీ ప్రాంతాలను సెక్టార్లుగా విభజించామని, నాలుగు సెక్టార్లుగా చేశామన్నారు. క్రైంపార్టీ, ప్రత్యేక పోలీసులు, మఫ్టీలో ఉన్న సిబ్బంది విధుల్లో ఉంటారన్నారు. నంద్యాల-మహానంది, నంద్యాల- గిద్దలూరు ఘాట్ రోడ్డులో పెట్రోలింగ్ ఉంటుందన్నారు. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్ వద్ద ప్రత్యేక సిబ్బంది విధులు చేపడతారని చెప్పారు. ఒక్కో సెక్టారుకు ఒక్కో సీఐ పర్యవేక్షిస్తారని వివరించారు. సీఐలు హుసేన్‌పీరా, బాలిరెడ్డి, దైవప్రసాద్, సురేంద్రనాథరెడ్డి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు పాల్గొన్నారు.