
మనసులేని పాలకులు : వైఎస్ జగన్
ముమ్మడివరం: తుపానులు, అకాల వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులు, పేదలను ఆదుకోని ఈ పాలకులకు మనసు అనేది ఉందా అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్‌మోహన్ రెడ్డి ఘాటుగా ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లాలో దెబ్బతిన్న పంటలను ఈరోజు ఆయన పరిశీలించారు. బాధిత రైతులను పరామర్శించారు. ముమ్మిడివరం నియోజకవర్గం చెయ్యేరులో రైతులను పరామర్శిస్తున్న సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన ఉందా? లేదా? అని ప్రశ్నించారు. ఎకరాకు 10 వేల రూపాయలు తక్షన సాయం అందించాలని డిమాండ్ చేశారు.
3 ఎకరాలు, 60 వేల రూపాయల పెట్టుబడి పెట్టానని, అంతా నీటిపాలైందని జగన్ దగ్గర ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఎకరాలకు 70 వేల రూపాయల పెట్టుబడి పెట్టానని అంతా హెలెన్ తుపాను తీసుకుపోయిందని మరోరైతు బాధపడ్డారు. ప్రభుత్వం నుంచి ఏ అధికారి రాలేదని, తమ దగ్గరకు వచ్చి నష్టం అంచనా వేయలేదని రైతులు వాపోయారు. తుపాన్ దెబ్బకు పాడైపోయిన వరి పైరును వారు జగన్కు చూపించారు. గతేడాది నీలం తుపాన్ నష్టపరిహారమే తమకు అందలేదని వాపోయారు. బాల అనే రైతు కన్నీరుమున్నీరయ్యారు. తన ఐదు ఎకరాలు పంట నీటిపాలైందని ఓ వృద్ధ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం గిట్టుబాటు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తుపాన్ దెబ్బకు వేల ఎకరాల్లో అరటి తోటలు, లక్షల ఎకరాల్లో వరి దెబ్బతిన్నాయని అన్నదాతలు వాపోయారు. హెలెన్ తుపాన్ దెబ్బకు విరిగిపడిన అరటి మొక్క్లలను,గెలలను వారు జగన్కు చూపించారు. జగన్ పొలాల్లోకి దిగి రైతుల కష్టాలు తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. రైతుల కష్టాలపై సీఎంకు లేఖ రాస్తానని చెప్పారు. తుపాన్ దెబ్బకు నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల రుణాలు మాఫీ చేసి, కొత్త రుణాలు మంజూరు చేయాలన్నారు.
అంతకు ముందు జగన్ కొత్తపేట నియోజకవర్గం అవిడిలోని హెలెన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. తమ పరిస్థితి దారుణంగా ఉందని జగన్ వద్ద రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నీలం తుపాన్ నష్టపరిహారం ఇప్పటికీ అందలేదని రైతులు చెప్పినప్పుడు ప్రభుత్వంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసుగా రెండు తుపాన్‌లు వచ్చినా పాలకులు రైతులను ఏమాత్రం పట్టించుకోకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉండటం చూస్తుంటే బాధ అనిపిస్తోందన్నారు. రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ కింద విత్తనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రైతుల కోసం మనస్ఫూర్తిగా కృషి చేసిన నాయకుడు వైఎస్ఆర్ అని తూర్పు గోదావరి జిల్లా రైతులు జగన్తో అన్నారు.