వేములపల్లి, న్యూస్‌లైన్: ఇసుక అక్రమ వ్యాపారంపై రెవెన్యూ అధికారులు కొరడా ఝలిపించారు. అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన ఏడు ఇసుక డంపులను సీజ్ చేశారు. ‘డంప్‌లు.. డబ్బులు’ శీర్షికన ఆది వారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. వేములపల్లి మండలంలోని పాలేరువాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలించేందుకు సిద్ధం చేసిన ఏడు ఇసుక డంపులను తహసీల్దార్ షేక్ అహ్మద్ ఆధ్వర్యంలో ఆదివారం సీజ్ చేశారు. మండలంలోని సల్కునూరు, బొమ్మకల్, రావులపెంట గ్రామాలలో అధికారులు పర్యటించారు. సల్కునూరులో ఆరుచోట్ల, రావుల పెంట పరిధిలో ఒక ఇసుకడంప్‌ను సీజ్ చేశారు. రెండు గ్రామాలలో సుమారు 60 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. సల్కునూరు పరిధిలో 40ట్రాక్టర్లు, రావులపెంట పరిధిలో 20ట్రాక్టర్ల ఇసుక చుట్టూ ముగ్గు పోసి సీజ్ చేశారు.
లారీలను పట్టించిన గ్రామస్తులు
మండలంలోని సల్కునూరు, కామేపల్లి, రావులపెంట గ్రామాల నుంచి హైదరాబాద్‌కు ఇసుక అక్రమంగా తరలిస్తున్న 13లారీలను మండలంలోని కుక్కడం గ్రామస్తులు ఆది వారం తెల్లవారుజామున అడ్డుకున్నారు. ఈ విషయాన్ని గ్రామస్తులు స్థానిక పోలీసులకు సమాచారం అందించినా పట్టించుకోలేదు. దీంతో గ్రామస్తులు మిర్యాలగూడ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. డీఎస్పీ ఆదేశాల మేరకు ఉదయం 8గంటలకు అక్కడికి చేరుకున్న పోలీసులకు గ్రామస్తులు 13లారీలను అప్పగించారు. కాగా పోలీసులు మాత్రం అందులో ఏడు లారీలకు వే బిల్లులు ఉన్నాయని వదిలేశారు. మండలంలోని పాలేరువాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నప్పటికీ దామరచర్ల మండలం వాడపల్లి నుంచి వే బిల్లులను తెచ్చి లారీలను తీసుకెళ్లినట్లు సమాచారం. లారీలను పట్టుకొని పోలీసులకు అప్పగించినా ప్రయోజనం లేకుండా పోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాగా ఆరు లారీలపై కేసు నమోదు చేసి తహసీల్దార్ షేక్ అహ్మద్‌కు అప్పగిస్తున్నట్లు ఎస్‌ఐ యాదగిరి తెలిపారు.
ఇసుక అక్రమ వ్యాపారంపై కొరడా
Published Mon, Dec 16 2013 3:59 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement