
మీడియాతో మాట్లాడుతున్న పుష్పశ్రీవాణి. చిత్రంలో జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్, ఎమ్మెల్యేలు జోగారావు, అప్పలనాయుడు
విజయనగరం గంటస్తంభం : నవరత్నాల హామీలను వందశాతం అమలుచేసే దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని, గవర్నర్ తన ప్రసం గంలో ఈ విషయం స్పష్టం చేశారని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక శనివారం తొలిసారిగా సొంత జిల్లాకు వచ్చిన ఆమె ఇక్కడి జెడ్పీ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. అవినీతి రహిత పాలన అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, అవినీతి ఎక్కడ జరిగినా ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు.
వలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలను లబ్ధిదారుల ఇళ్లకే నేరుగా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. కుల, మత, రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తామని వివరించారు. రాష్ట్రంలో గిరిజన సంక్షేమం, అభివృద్ధికోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకునేందుకైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధంగా ఉన్నారని ఆమె చెప్పారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్, పార్వతీపురం, నెల్లిమర్ల ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, బడ్డుకొండ అప్పలనాయుడు పాల్గొన్నారు.