
మసీదు కూల్చివేతకు సర్కారు కుట్ర
విజయవాడలోని ఇన్నర్ రింగ్‌రోడ్డు విస్తరణ పేరుతో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న మసీదును...
► ముస్లింల మనోభావాలతో చెలగాటం
► దుర్మార్గానికి ప్రభుత్వం ప్రణాళిక
► బెదిరింపులకు పాల్పడుతున్న ఉన్నతాధికారి
► వత్తాసు పలుకుతున్న ఎమ్మెల్యే జలీల్‌ఖాన్
ముస్లింల మనోభావాలకన్నా తమవారికి అండగా నిలవాలనే నిర్ణయానికి చంద్రబాబు సర్కారు వచ్చింది. అనుయాయుల స్థిరాస్తుల పరిరక్షణకు ప్రాధాన్యతనిచ్చే క్రమంలో రామవరప్పాడు రైవస్ కాల్వగట్టుపై ఉన్న మసీదును కూల్చివేసేందుకు నిర్ణయించింది. అధికార పదవులకు అర్రులు చాస్తున్న సంబంధిత ప్రజాప్రతినిధులు అడ్డగోలు నిర్ణయాలకు వంతపాడుతున్నారు. ఉన్నతాధికారులు ముస్లిం మత పెద్దలపై బెదిరింపులకు దిగుతున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలున్నందున కూల్చివేయక తప్పదని, అడ్డుచెబితే అడ్డంగా బుక్కయిపోతారనే హెచ్చరికలు చేస్తున్నారనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : విజయవాడలోని ఇన్నర్ రింగ్‌రోడ్డు విస్తరణ పేరుతో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న మసీదును కూల్చివేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడం ముస్లిం మనోభావాలపై పిడుగు పడుతున్నట్లయింది. పేదలు, ముస్లింల మనోభావాలకు అండగా ఉంటామని వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇదివరకే ప్రకటించారు. బాధిత కుటుంబాలను నేరుగా కలిసి సంఘీభావం కూడా వ్యక్తం చేశారు. స్థాని కులు, మత పెద్దల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని గన్నవరం ఎమ్మెల్యే వంశీమోహన్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జిల్లా ఉన్నతాధికారులను కోరినా ఖాతరుచేయడం లేదనేది సమాచారం. మసీదును కూల్చవద్దని కోరుతున్న వంశీని ఉద్దేశించి ‘అందరికీ సర్దిచెప్పాలని’ సూచిస్తున్నారని తెలిసింది. దీంతో వంశీ నోరు విప్పడంలేదని స్థానిక పెద్దలు అంటున్నారు.
ముస్లింలకు అండగా నిలవడమే కాకుండా మసీదును రక్షించి ఆ మత పెద్దల మన్ననలు అందుకోవాల్సిన పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ సీఎం మెప్పుపొందేందుకు మసీదు కూల్చివేతకు పరోక్షంగా సహకరిస్తున్నారనేది వినికిడి. ఈ విషయంలో జలీల్‌ఖాన్‌పై సంబంధితుల నుంచి వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోందని తెలుస్తోంది. ఆయన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగా గెలుపొంది ఇటీవలే టీడీపీలో చేరారు. చేరిన కొద్దిరోజుల్లోనే సీఎం వద్ద తనపట్టు నిలుపుకొనేందుకు ముస్లింలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి విఫలం కావడంతో ఎలాగైనా ముఖ్యమంత్రి మెప్పుకు ప్రయత్నిస్తున్నారని ముస్లిం మత పెద్దలు గుర్తుచేస్తున్నారు.
తమ పవిత్ర దేవాలయమైన మసీదును కూల్చడం ద్వారా ముస్లిం మైనార్టీల మనోభావాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని అధికార పార్టీ ముఖ్య నాయకులు కూడా ఆందోళన చెందుతున్నారు. సుమారు ఏడాది కాలంగా మసీదును రక్షించాలంటూ ముస్లింలు ఎన్నో ఆందోళనలు చేశారు. వీరికి వైఎస్సార్ సీపీ నాయకులు అండగా నిలిచారు. మసీదు కూల్చివేతకు నిరసనగా కృష్ణా జిల్లా వైఎస్సార్ సీపీ నాయకులు కె.పార్థసారథి, డాక్టర్ దుట్టా రామచంద్రరావుతో పాటు పలువురు నాయకులు కలిసి రామవరప్పాడులో ఇళ్లు కోల్పోయే బాధితుల వద్దకు పాదయాత్ర నిర్వహించారు. వేలాదిమందికి ఉపాధి లేకుండా చేస్తే ఎలాగంటూ ఆందోళన చేయడంతో దిగివచ్చిన ప్రభుత్వం వారికి వైఎస్సార్ కాలనీలో నిర్మించిన ఇందిరమ్మ గృహాలు కేటాయించింది.
ముస్లింలకు మద్దతుగా నిలిచిన వైఎస్సార్ సీపీ
ముస్లిం మైనార్టీలకు అన్యాయం జరగకూడదని, వారి మనోభావాలకు ఎటువంటి దెబ్బ తగలకూడదని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొన్నాళ్ల కిందట రామవరప్పాడు బాధితులను పరామర్శించిన సందర్భంలో చెప్పారు. మసీదు కూల్చివేయాలనే ఆలోచనకు స్వస్తిపలకాలని సీఎం చంద్రబాబుకు హితవు పలికారు. బాధితులను పరామర్శించి అవసరమైతే తమ పార్టీ తరఫున బాధితులకు పూర్తిస్థాయిలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డి బాధితులకు అండగా ఉండడంతో సీఎం కాస్త వెనక్కు తగ్గారు. ఆ తరువాత బాధితులను పలు రకాలుగా ప్రలోభాలకు గురిచేసి చివరకు వారిని ఖాళీ చేయించారు. మసీదు విషయంలో ముస్లింలు రాజీ పడడం లేదు.
రాత్రికి రాత్రి తొలగించే యత్నంలో...
మసీదును రాత్రికి రాత్రి తొలగించేందుకు కలెక్టర్ నేతృత్వంలో సీఎం కొందరు అధికారులను నియమించినట్లు విశ్వసనీయ సమాచారం. వారు ఏరోజైనా తొలగించే అవకాశం ఉందనే అనుమానాలు ముస్లిం పెద్దల్లో వ్యక్తమవుతోంది. ఇంతటి దుర్మార్గాన్ని తామెక్కడా చూడలేదని, లౌకిక వ్యవస్థలో ఒక వర్గం మనోభావాలు దెబ్బతీసే చర్యలు మరో వర్గం చేసేందుకు పూనుకోవడం పూర్తిస్థాయిలో నేరం అవుతుందని వారు వాదిస్తున్నారు. తమ వారి ఆస్తులను కాపాడడానికి పేదల ఇళ్లను తొలగించారని, గతంలో రోడ్డు దిశను కూడా మార్చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అంశం నగరంలోను, శివారు ప్రాంతంలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.